విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. మెట్రోతో పాటు మరిన్ని వరాలు

 

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన నివేదికను సీఎం పరిశీలించారు. మెట్రో రైలు మార్గం మొత్తం 140.13 కిలోమీటర్ లతో ఏర్పాటు చేయాలని అధికారులు డిజైన్ చేశారు. ఈ దశలో 10 కారిడార్ల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ మొత్తం 46.40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేయనున్నారు. తొలి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్ల కారిడర్, గురుద్వారా ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.26 కిలోమీటర్ల కారిడార్, తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలో మీటర్ల మేర కారిడర్ ఉండనున్నాయి. తొలి దశ మెట్రోను 2024 సంవత్సరానికల్లా పూర్తి చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వాడుతున్న మెట్రో రైల్ మోడళ్లను పరిశీలించి బెస్ట్ మోడల్ ఎంపిక చేయాలని ఆదేశించారు సీఎం జగన్. మెట్రో రైల్ కోచ్ నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు సూచించారు.  ముంబై మెట్రో నిర్మాణంలో పిల్లర్ డిజైను పరిశీలించాలన్న సీఎం.. ప్రతి స్టేషన్ వద్ద ప్రధాన జంక్షన్ల వద్ద పార్కింగ్ కు స్థలాలు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు. 

మరోవైపు గ్రేటర్ విశాఖకు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపైన ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. నగరాభివృద్ధిపైనా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై విశాఖ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. పోలవరం వద్దే నీటిని ఫిల్టర్ చేసి అక్కడి నుంచి విశాఖకు పంపిణీ చేయాలన్నారు. కెనాల్స్ ద్వారా వస్తున్న నీటిని 40 శాతం వృథా అవుతున్న పరిస్థితుల్లో పైపు లైన్ ద్వారా తాగునీటి సరఫరా అత్యవసరమని అధికారులు తెలిపారు. పరిశ్రమల అవసరాల కోసం డీశాలినేషన్ వాటర్ ప్లాంటు ఏర్పాటుపై సీఎం చర్చించారు. ఇజ్రాయిల్ తరహాలో మనం కూడా పరిశ్రమలకు ఫ్రెష్ వాటర్ కాకుండా డిసాలినేషన్ నీటిని వాడే ఆలోచన చేయాలన్నారు. లీటర్ నీటికి 4 పైసలు ఖర్చవుతుందన్న సీఎం అలా డిసాలినేషన్ చేసిన నీటిని పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. అలాగే విశాఖ నగరంలో వ్యర్థాల నిర్వహణపైనా సీఎం జగన్ దృష్టి సారించారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యల పై సీఎం పలు సూచనలు చేశారు. కాపులుప్పాడలోని డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రక్రియకు సీఎం ఆమోదించారు. అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బీచ్ రోడ్ లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.