రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి తపన

 

దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు కేంద్రం త్వరలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు జరుగుతున్నపరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి సహజంగానే అందరికంటే ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేయబడటంతో, రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తపనతో ఆయన క్రిందటి వారంలో మూడు రోజులుపాటు డిల్లీలో మకాం వేసి సోనియా గాంధీని కలిసి తన వాదనను వినిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. అందుకోసం ఆయన అత్యంత రహస్యంగా ఒక ప్రత్యేక నివేదిక కూడా తయారు చేయించారు. దానిలో తెలంగాణను రూ.80,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన చేసారు. అయితే, తెలంగాణా అంశంపై కోర్ కమిటీ ఇప్పటికే సుదీర్గ చర్చలు చాలా చాల చేసి, ఒక నిర్ణయానికి వచ్చినందున, ఇక ఈ విషయంలో మళ్ళీ మరో ఆలోచనకు ఇష్టపడని సోనియా గాంధీ, ముఖ్యమంత్రిని కలిసేందుకు నిరాకరించారు. అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ద్వారా ఆమెను ఒప్పించి కలవాలని విశ్వప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి దిగ్విజయ్ సింగ్ వచ్చి సోనియా గాంధీ అభిప్రాయం ఆయనకు తెలియజేయడంతో, ఆయన నిరాశగా వెనుతిరిగి వచ్చారు.

 

ఆ తరువాత టీ-కాంగ్రెస్ నేతల బహిరంగ సభ జరగడం, ఆ మరునాడే దిగ్విజయ్ సింగ్ పదిరోజుల్లో తెలంగాణాపై నిర్ణయం వెలువడుతుందని ప్రకటించడం అంతా శాస్త్ర ప్రకారమే జరిగిపోయింది. ఇక, ఆయన తెలంగాణపై రోడ్ మ్యాప్ తయారుచేసే బాధ్యతకూడా ఆయన ముఖ్యమంత్రికే అప్పజెప్పడం విశేషం.