కిరణ్ పట్టిన కుందేలుకి మూడే కాళ్ళా?

 

మంత్రి డీయల్ రవీంద్ర రెడ్డిని బర్త్ రఫ్ చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గంపై పైచేయి సాధించారని అయన అనుచరులు భావిస్తుంటే, ‘అదొక పొరపాటు నిర్ణయం’ అని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అని ఆ మరునాడే ప్రకటించడమే కాకుండా ఇటువంటి పొరపాట్లు ఇక ముందు జరుగవని కూడా హామీ ఇవ్వడం విశేషం. డీయల్ ను బర్త్ రఫ్ చేస్తున్నట్లు ఆయనకు ముఖ్యమంత్రి ముందుగా తెలియజేయలేదని ఆయన మీడియాతో చెప్పిన మాటలవల్ల అర్ధం అవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తుపోకడల గురించి ఇప్పటికే అనేక మార్లు అధిష్టానానికి పిర్యాదులు చేసిన బొత్స సత్యనారాయణ, ఈ రోజు డిల్లీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి చర్చిస్తానని కూడా స్పష్టంగా చెప్పారు. బొత్సతో బాటు మరికొంత మంది మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయంపట్ల తీవ్ర అసంతృప్తి వెల్లడించారు.

 

ఇక, హోంమంత్రి పదవి ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా ముఖ్యమంత్రి హిట్ లిస్టులో పేరున్నవారే గనుక, ఆయన తనని వెళ్ళగొట్టక ముందే తానే తప్పుకోవాలనుకొన్నారు. కానీ, మంత్రి జానారెడ్డి సలహా మేరకు ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇక, వేటుకోసం ఎదురుచూస్తున్న మరో మంత్రి రామచంద్రయ్య, ఈ మద్యన కొంచెం జోరు తగ్గించుకొన్నారు. బహుశః చిరంజీవి ఆయనను వెనక్కి తగ్గమని సూచించి ఉండవచ్చును.

 

ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి కొంత మందితో తనకొక ప్రత్యేక వర్గం తయారుచేసుకొని ముందుకు సాగుతున్నపటికీ, ఆయనను పార్టీలో వ్యతిరేఖించేవారు చాల మందే ఉన్నారనేది సుస్పష్టం. ఆయన తన ప్రస్తుత పద్దతిలోనే ముందుకు సాగితే ప్రస్తుతం ఆయన ఏర్పరుచుకొన్న స్వంత వర్గంలో మంత్రులు కూడా ఏదో ఒకనాడు ఆయనతో విభేదించచ్చును. అప్పుడు ఆయన పార్టీలో ప్రభుత్వంలో ఒంటరి అవడం ఖాయం.

 

కిరణ్ కుమార్ రెడ్డి రెండున్నర సం.లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నపటికీ ఇంతవరకు తన స్వంత పార్టీకి ప్రభుత్వానికి మద్య సమన్వయము సాదించడంలో విఫలమవడం చాలా ఆశ్చర్యకరమే. అయితే, భేషజానికి పోయి అందరినీ దూరం చేసుకొంటున్న ముఖ్యమంత్రి అందుకు ఇతరులను ఈ విధంగా బలి తీసుకోవడం మరీ ఆశ్చర్యకరం. సహచర మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, సమర్ధంగా ప్రభుత్వాన్ని నడిపించవలసిన ముఖ్యమంత్రి వాటిని వ్యక్తిగత విమర్శలుగా భావిస్తూ, వారిని తన శత్రువులని భావించడమే దీనికి మూలకారణం.

 

తన స్వంత పార్టీలో, ప్రభుత్వంలో ఇంత మంది తనను వ్యతిరేఖించడానికి కారణం ఏమిటని ఆత్మవిమర్శ చేసుకోకుండా అహానికి పోయి అందరినీ దూరం చేసుకోవడం వల్ల ఆయనకీ ఇంతా బయటా శత్రువులే మిగులుతారు. సాధారణ ఎన్నికలను ఎదురుగా ఉంచుకొని ముఖ్యమంత్రే స్వయంగా ఇటువంటి పరిస్థితులను సృష్టించుకోవడం వల్ల ఆయనకీ, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగడమే కాకుండా, ప్రతిపక్షాలకు వరంగా కూడా మారుతుంది.