కొత్త పార్టీ స్థాపనకు కూడా అధిష్టానం అనుమతి కావాలా?

 

కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ అధికారం చేప్పట్టి సీమాంధ్రలో పార్టీని కాపాడుకోవాలని చాలా ఆరాటపడుతోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత మంది శాసనసభ్యులు లేనందున, కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, పార్టీ నుండి బహిష్కరింపబడిన సీమాంధ్ర నేతలు మళ్ళీ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని నిన్న దిగ్విజయ్ సింగ్ సిగ్గు విడిచి ప్రకటించినా సానుకూల స్పందన రాలేదు. అందుకే ఆయన మళ్ళీ తన విధేయులైన సీమాంధ్ర మంత్రులతో వార్ రూమ్ లో తలుపులేసుకొని మంతనాలు మొదలుపెట్టారు.

 

ఇక కిరణ్ కుమార్ రెడ్డి గూటికి చేరుకొన్న సబ్బంహరి ఆయన స్థాపించబోయే కొత్త పార్టీకి అ(న)ధికార ప్రతినిధిలా ఎప్పటికప్పుడు మీడియాకు తాజా సమాచారం తెలియజేస్తూ చాలా పుణ్యం కట్టుకొంటున్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ “డిల్లీలో పరిణామాలను మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాము. వాటిని బట్టే మేము కూడా మా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొంటామని” తెలిపారు. కొత్త పార్టీ పెట్టడానికి డిసైడ్ అయిపోయిన తరువాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా డిల్లీ వైపు ఎందుకు చూస్తున్నారు? అనే అనుమానం ఎవరికయినా కలగడం సహజం.

 

కొత్త పార్టీ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రానందునే కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వెళ్ళడం లేదని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలిస్తే, ఆయన స్వయంగా వెళ్లలేకపోయినా, కనీసం తన అనుచరులను పంపి ప్రభుత్వాన్ని నిలబెట్టే అవకాశం ఉంది. అదే ఇప్పుడే ఆయన కొత్తపార్టీ పెట్టేస్తే ఇక కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని వెనక్కిరమ్మని సిగ్గు విడిచి పిలిచినా ఆయన కానీ, ఆయన వెంట వెళ్ళినవారు గానీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకోలేరు.

 

బహుశః అందుకే “డిల్లీలో పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని” సబ్బం హరి శలవిస్తున్నరేమో! కాంగ్రెస్ అధిష్టానం తెరాస, మజ్లిస్ పార్టీల మద్దతు కన్ఫర్మ్ చేసేసుకొని, కొత్త ముఖ్యమంత్రి పేరు ఫైనల్ చేసేసుకోగానే ఇక కిరణ్ కుమార్ రెడ్డి నిశ్చింతగా కొత్త పార్టీ పెట్టేసుకోవచ్చును. ఎంతయినా ఆయన కూడా కాంగ్రెస్ ఉప్పు తిన్న మనిషే కదా!