ఇంకా లాస్ట్ బాల్స్ మిగిలే ఉన్నాయి: కెప్టెన్ కిరణ్

 

పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే తన పదవి నుండి తప్పుకొంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతూ వచ్చినందున, ఆయన ఈరోజు తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ చేయలేదు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే ఇక ఉండబట్టలేక “రాజీనామా చేస్తానన్నారు కదా? ఇంకా చేయలేదేమిటి?” అని మీడియా ద్వారా ప్రశ్నించారు కూడా. అయితే కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం లాస్ట్ బాల్స్ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని టక్కున సమాధానం ఇచ్చారు. 

 

రాజీనామా చేయడమనేది తన ముందున్న అనేక ఆప్షన్లలో ఒకటని, తన సహచరులతో చర్చించిన తరువాతనే ఏ నిర్ణయమయినా తీసుకొంటానని తెలిపారు. తనకు లాస్ట్ బాల్స్ చాలా మిగిలే ఉన్నాయని చెపుతూనే, పనిలోపనిగా తన అధిష్టానానికి మళ్ళీ గుగ్లీలు వేసారు. "

 

మతతత్వ పార్టీ అని మనం నిత్యం విమర్శించే బీజేపీతో ప్రధానమంత్రి లంచులు, డిన్నర్లు చేయడాన్ని ఏమనుకోవాలి? మన స్వంత పార్టీ నేతలని పక్కనపడేసి మన రాజకీయ ప్రత్యర్దులని సహాయం కోసం అర్దించడం ఏమిటి? స్వంత పార్టీనే నమ్మనివారు ప్రత్యర్ధి పార్టీని ఏవిధంగా నమ్ముతున్నారు? ఏవిదంగా సహాయం ఆశిస్తున్నారు? పార్లమెంటులో జరిగిన సంఘటనలకు ప్రధాని తన హృదయం రక్తం కారుస్తోందని అన్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న తప్పుడు నిర్ణయానికి ఇక్కడ కోట్లాది ప్రజల హృదయాలు రక్తం స్రవిస్తున్న సంగతి ఆయనకి తెలియదా? తెలిసీ పట్టించుకోవడం లేదనుకోవాలా?” అని సమాధానాలు దొరకని అనేక యక్షప్రశ్నలు వేసారు.

 

కానీ, మళ్ళీ అంతలోనే తన మాటలతో సోనియమ్మ మనసు నొప్పించినందుకు బాధపడుతూ, “నేటికీ సోనియాగాంధీయే మా అధినేత. ఆమె అంటే నాకు అపారమయిన గౌరవం ఉంది. నేను రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మాత్రమె వ్యతిరేఖిస్తున్నాను తప్ప ఆమెను, మా పార్టీని కాదు,” అని ముగించారు.

 

ఇక అటువైపు నుండి దిగ్విజయ్ సింగ్ కూడా అంతే ఇదిగా స్పందిస్తూ, “కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి విధేయుడయిన మంచి క్రమశిక్షణ గల నేత” అని కిరణ్ కాండక్ట్ సర్టిఫికేట్ ని ఈరోజు మరోమారు రెన్యువల్ చేసారు.

 

మరి తెదేపా, వైకాపా నేతలు ఆయనపై అనుమానం పడిపోతున్నారంటే ఎందుకు పడరూ? అందుకే “ఆయన సమైక్య ముసుగులో దాగిన విభజనవాదని” జగన్మోహన్ రెడ్డి కూడా సర్టిఫై చేసేసారు.