విప్లవాత్మక చట్టం దిశగా కేసీఆర్ అడుగులు... మొత్తం వ్యవస్థ సమూల ప్రక్షాళనే లక్ష్యం

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు చేపడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై గట్టి పట్టుదలతో ఉన్న కేసీఆర్, కొద్దిరోజులుగా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తి పారదర్శకంగా ఉండే నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దాదాపు 85నుంచి 90శాతం భూములకు ఎలాంటి వివాదాల్లేవని భూరికార్డుల ప్రక్షాళనతో తేలినప్పటికినీ, రెవెన్యూ యంత్రాంగం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఎలాంటి సమస్యల్లేని భూముల విషయంలోనూ ప్రజలకు నరకం చూపిస్తున్నారన్న ఆరోపణలతో, మొత్తం వ్యవస్థనే సమూలంగా మార్చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులకు విచక్షణాధికారం లేకుండా చేయడం లేదా నామమాత్రం చేస్తూ కొత్త చట్టం రూపొందించాలని భావిస్తున్నారు. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగించే కోర్ బ్యాంకింగ్ విధానాన్నే భూముల లావాదేవీలకు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రుణాల మంజూరు, మార్ట్ గేజ్ కోసం రైతుల పాస్‌‌బుక్స్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్ భూరికార్డులను పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే చట్ట సవరణ చేసినా, అది పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో... కొత్త చట్టంలో సంబంధిత అంశాలను విధిగా పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు లావాదేవీల తరహాలోనే భూలావాదేవీలు నిర్వహించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ యంత్రాంగానికి విచక్షణాధికారాలు ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడిందని భావిస్తోన్న కేసీఆర్... ఏమాత్రం అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా కొత్త చట్టాన్ని తేవాలనుకుంటున్నారు.

కొత్త రెవెన్యూ చట్టంలో భూములు, ఆస్తులపై సర్వాధికారం యజమానులకు ఉంటుంది. వీటి రిజిస్ట్రేషన్లను స్వతంత్ర వ్యవస్థ దగ్గర చేసుకుంటే టైటిల్‌ డీడ్‌ జారీ చేస్తారు. దానికన్నా ముందే భూములు పొజీషన్‌లో ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అభ్యంతరాలు స్వీకరిస్తారు. భూములు రిజిస్ట్రేషన్‌ అయినా తర్వాత అవి పరాధీనం అయినా, లేక ఆ భూములు తమవేనని ఎవరైనా అర్జీలు సమర్పించినా విచారణ జరుపుతారు. వారి వాదన నిజమేనని తేలితే వారికి నష్టపరిహారం చెల్లిస్తారు. కొత్త చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌పై సబ్‌ రిజిస్ట్రార్‌, తహశీల్దార్లకు అధికారం ఉండదు. ప్రభుత్వం ప్రతిపాదించే స్వతంత్ర వ్యవస్థ చూసుకుంటుంది. భూములు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నప్పుడు ఆ భూమికి రక్షణ కల్పించడానికి వీలుగా ప్రత్యేక రుసుమును ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఆ భూమికి వసూలు చేసే నిధిని బీమా రూపంలో జమ చేస్తుంది. స్వతంత్ర వ్యవస్థ ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేసి, రికార్డుల్లో మ్యుటేషన్‌ చేస్తే ఆ భూమికి కంక్లూజివ్‌ టైటిల్‌ దక్కుతుంది. ఇలా, అనేక మార్పులు చేర్పులతో, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోన్న కేసీఆర్ ప్రభుత్వం.... విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.