అభ్యర్థులతో పార్టీ అధ్యక్షుని భేటీ

 

అసెంబ్లీని రద్దు చేసిన తెరాస ప్రభుత్వం అందరికన్నా ముందే తొలి విడతగా పార్టీ తరుపున పోటీ చేసే 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ప్రచారం కూడా ప్రారంభించిన కేసీఆర్ ప్రచారానికి స్వల్ప విరామం ప్రకటించారు.అనంతరం పార్టీ మానిఫెస్టోపై ద్రుష్టి సారించారు.తెరాస పాక్షిక మేనిఫెస్టో కూడా ప్రకటించింది.దీంతో మళ్ళీ ప్రచార పర్వం ప్రారంభించేందుకు అధినేత సిద్ధమవుతున్నారు.ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు.

అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచే అభ్యర్థులు తమ తమ నియోజక వర్గాల్లో ప్రచారం ప్రారంభించారు.పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది గనక వారందిరనీ సర్దుబాటు ధోరణితో పద్ధతి ప్రకారం వ్యవహరించాలని సూచించారు. అలాగే, ప్రచార సామగ్రిని సైతం పంపిణీ చేశారు.అనంతరం ప్రచారం జరుగుతున్నతీరుపై ఫోన్ల ద్వారా కేసీఆర్ ఎప్పటికప్పుడు అభ్యర్థులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు.

కొన్నినియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు చేదు అనుభవాలు ఎదురవటంతో నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతున్న తీరు, పార్టీ విధి విధానాలపై ప్రజల స్పందన,ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు? ప్రజలనుంచి వస్తున్న అభ్యర్థనలేంటి తదితర అంశాలపై చర్చించేందుకు పార్టీ అభ్యర్థులతో మరోసారి సమావేశం కావాలని కేసీఆర్‌ నిర్ణయించారు.ప్రతిపక్షాల తీరు, వారి ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలి? సోషల్‌ మీడియాలో ప్రచారం ఎలా నిర్వహించాలి? పోలింగ్‌ తేదీ వరకు అభ్యర్థులు ఎలా వ్యవహరించాలనే అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.