సొంత పబ్లిసిటీ కోసం, సొంత ఎజెండాలతో పనులు చేయొద్దు: సీఎం కేసీఆర్

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిన క్రమంలో బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ ను సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో సాగునీటి రంగంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అధికారుల వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సొంత పబ్లిసిటీ కోసం సొంత ఎజెండాలతో పనులు చేయొద్దని ప్రభుత్వ కార్యక్రమాలే అమలు చేయాలని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాగునీటికి సంబంధించిన ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ వ్యవస్థను పదకొండు సర్కిళ్లుగా విభజించాలని సూచించారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ ఉండాలని సూచించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కాళేశ్వరం నుంచి తుమ్మడిహట్టి వరకు ఆరు చోట్ల గేట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీలు సకాలంలో పనులు పూర్తి చేయటం లేదని అలాంటి వాటిని గుర్తించి రద్దు చెయ్యాలని ఆదేశించారు. 

అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా లక్ష్మి బ్యారేజీని సందర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రాణహిత నదీ జలాలను పరిశీలించారు, ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మి బ్యారేజ్ ను వీక్షించారు సీఎం. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజనీర్ లతో సమీక్షించారు. రాబోయే వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా చేరుతుందని లక్ష్మీ బ్యారేజి నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని సూచించారు. లక్ష్మీ బ్యారేజీ సందర్శన కంటే ముందు కరీంనగర్ నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వరం చేరుకున్న కేసీఆర్ హెలికాప్టర్ నుంచి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ లను ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పూజలు చేశారు, నదిలో నాణేలు వదిలి జల నీరాజనాలు అర్పించారు. ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు.