మీడియాకు దూరంగా ఉండమని పార్టీ నేతలను హెచ్చరించిన కేసీఆర్

ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ అంతా ఒకటే చర్చ నడుస్తోంది. మీడియా డిబేట్ లలో గులాబీ నేతలు ఎందుకు కనిపించడం లేదు. ఏమైనా తీవ్ర కారణాలు ఉన్నాయా, లేక ఇతర సమస్యల వల్ల వారు మీడియాకు దూరంగా ఉంటున్నారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఆర్నెళ్లుగా గులాబీ నేతలు మీడియాకు దూరంగా ఉంటున్నారు. టీవీ ఛానల్ డిబేట్లకు కూడా రావడం లేదు. టీఆర్ఎస్ అధికార ప్రతి నిధులను త్వరలోనే ప్రకటిస్తాం. ఆ తరువాత డిబెట్ లో పాల్గొనే ప్రతి నిధుల జాబితా విడుదల చేస్తామంటూ ఇప్పటి వరకు మూడు నాలుగు సార్లు టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు జాబితా మాత్రం విడుదల చేయలేదు. మీడియా డిబేట్ల ద్వారా కొందరు నేతలు వెలుగులోకి రావడం టీఆర్ఎస్ పార్టీలోనే కొందరికి నచ్చడం లేదు. దీంతో పార్టీ తరపున ఏ ఏ నేతలు చర్చల్లో పాల్గొనాలో లిస్ట్ ఇస్తామని అప్పట్లో టీఆర్ఎస్ భవన్ నుంచి సమాచారం వచ్చినా.. కానీ ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు నేతల పేర్లు మాత్రం ప్రకటించలేదు. అయితే టీఆర్ఎస్ నేతలను టీవీ డిబేట్ లకు వెళ్లద్దని పార్టీ ఎందుకు ఆదేశించిందనే చర్చ నడుస్తోంది.

ఇటీవల టీవీ చర్చా కార్యక్రమాల్లో కొందరు టీఆర్ఎస్ నేతలు సరిగ్గా మాట్లాడక పోవడం ఇబ్బందిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన చర్చల్లో పార్టీ నేతలు పరిజ్ఞానం లేకుండా తప్పుడు లెక్కలు చెప్పడం కేసీఆర్ దృష్టికీ వెళ్లింది. అప్పటి నుంచి పార్టీ నేతలు డిబేట్ లకు వెళ్లొద్దని సీఎం కేసీఆర్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే కొంత మంది నేతలు డిబేట్ లలో కనిపించి నియోజకవర్గాల్లో రెడిమేడ్ లీడర్ లుగా ఫోకస్ ఇస్తున్నారని ఇది పార్టీకి ఇబ్బందిగా మారిందని కొందరు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ కారణాలతో మీడియాకు గులాబీ నేతలు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.

గత ఏడాది కాలంలో ప్రభుత్వ పరంగా పలు కార్యక్రమాలు జరిగాయి. కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే వాయిస్ లేకుండా పోయిందనేది టీఆర్ఎస్ నేతల మాట. టీవీ చర్చలు, ప్రెస్ మీట్ల ద్వారా అంతో ఇంతో సమాచారం జనంలోకి వెళ్లేది కానీ ఇప్పుడు మొత్తం వన్ వే కమ్యునికేషన్ అయిపోయిందనీ గులాబీ నేతలు వాపోతున్నారు. పార్టీ తరుపున వాయిస్ వినిపించే నేతలు ఎంపికపై కొంత కసరత్తు జరిగింది. అధికార ప్రతినిధులకు సమాచారం ఇచ్చేందుకు బ్యాక్ ఆఫీస్ టీమ్ ను కూడా ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఏమైందో ఏమోగానీ ఈ టీమ్ ఎంపిక వాయిదా పడిందని తెలుస్తోంది. త్వరలోనే టీవీ చర్చల్లో పాల్గొనే గెస్టుల దిశతోపాటు అధికార ప్రతి నిధుల జాబితా కూడా విడుదల చేస్తారని సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత పార్టీలో భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల తర్వాత కారు జోరు పెరుగుతుందో తగ్గుతుందో వేచి చూడాలి.