మనసున్న మారాజు కేసీఆర్.. సలీమ్ ని చూసి చలించిన సీఎం...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం చాటుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో... చేతిలో దరఖాస్తు పట్టుకొని రోడ్డుపక్కన నిలబడిన వృద్ధుడిని చూసి... సీఎం కేసీఆర్‌ చలించిపోయారు. సెక్యూరిటీని సైతం పక్కనబెట్టి, తన కాన్వాయ్‌ను ఆపడమే కాకుండా, కారు దిగి, ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లారు. అతను చెప్పిన సమస్యలను ఓపికగా విని, అప్పటికప్పుడు పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ టోలిచౌకిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై, తిరిగి వెళ్తుండగా, చేతిలో దరఖాస్తు పట్టుకుని నిల్చున్న వృద్ధుడ్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. కారు దిగిన కేసీఆర్‌, ఆ వృద్ధుడి దగ్గరకెళ్లి వివరాలు అడిగారు. తన పేరు సలీమ్ అంటూ పరిచయం చేసుకున్న వృద్ధుడు... గతంలో తాను డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, నాలుగేళ్ల క్రితం భవనం పైనుంచి పడటంతో కాలు విరిగిందని ముఖ్యమంత్రికి వివరించాడు. తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని, ఉండటానికి ఇల్లు కూడా లేదంటూ తన గోడును కేసీఆర్‌కు చెప్పుకున్న సలీమ్‌.... తగిన సాయం చేయాలని విన్నవించుకున్నాడు. మహ్మద్ సలీమ్‌ బాధను అర్ధం చేసుకున్న సీఎం కేసీఆర్‌, సానుకూలంగా స్పందించారు. సలీమ్‌కు వికలాంగుల పెన్షన్‌తోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ హైదరాబాద్‌ కలెక్టర్ శ్వేతామహంతిని ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో, టోలిచౌకిలో నివాసముంటున్న సలీమ్ ఇంటికెళ్లిన హైదరాబాద్‌ కలెక్టర్ శ్వేతామహంతి... కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. సలీమ్‌ వికలాంగుడని ధృవీకరించే సర్టిఫికెట్ ఉండటంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. అలాగే, జియాగూడలో డబుల్ బెడ్రూమ్‌ ఇల్లు కేటాయించారు. అంతేకాదు, ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు చికిత్స చేయించడంతోపాటు అనారోగ్యంతో బాధపడుతోన్న అతని కుమారునికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్ధిక సాయం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే, తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలీమ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.