వణికిపోతున్న గులాబీ నేతలు... గండం గట్టెక్కేందుకు నానా తిప్పలు...

తెలంగాణ మున్సిపోల్స్ లో రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడగా, అభ్యర్ధుల ఎంపిక ప్రధాన పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నేతల్లో గుబులురేపుతోంది. నేనంటే నేనంటూ ద్వితీయ శ్రేణి నేతలంతా పోటీకి సై అంటుండటంతో... అభ్యర్ధుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. మరోవైపు, పాత... కొత్త నేతల మధ్య పోరు ...పార్టీ పెద్దలకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. అయితే, మున్సిపోల్స్ ను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, అధికార టీఆర్ఎస్ మరింత సవాలుగా తీసుకుంది. పైగా ఒక్క మున్సిపాలిటీ చేజారినా పదవులు ఊడతాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో.... అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.

అయితే, ప్రతి చోటా టికెట్ల పంచాయతీ జరుగుతోంది. సిట్టింగ్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఆశావహులు పోటీ పడుతున్నారు. నాకు టికెట్ రాకపోతే... వాడెలా గెలుస్తాడో చూస్తానంటూ ఆశావాహులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దాంతో, గులాబీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు, ఒక్కో డివిజన్‌ నుంచి ఐదుగురు చొప్పున టికెట్లు ఆశిస్తుండటంతో అభ్యర్ధుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపు ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు అప్పగించడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

అయితే, సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్లు కేటాయించనుండటంతో, సిట్టింగుల్లో ఎక్కువ మందికి అవకాశం రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. దాంతో, టికెట్‌ దక్కకపోతే రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు కొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు, టీఆర్ఎస్‌లో అసంతృప్తులకు గాలమేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తుండటంతో.... వాళ్లను బుజ్జగించేందుకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. మొత్తానికి, ఒకవైపు రెబల్స్ బెడద.... మరోవైపు సీఎం కేసీఆర్‌ పెట్టిన బాధ్యతలు గుర్తొచ్చి... ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలోనని గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.