నిజం ఒప్పుకున్న కేసీఆర్..! సమస్య పరిష్కారం కోసం ఏపీకి రిక్వెస్ట్

 

 

మంత్రులు... తెలంగాణలో అసలు యూరియా కొరతే లేదన్నారు. విపక్షాలే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. ఏదో యాక్సిడెంటల్ గా ఒక రైతు గుండెపోటుతో మరణిస్తే, యూరియా కోసం పడిగాపులుపడి ఆ మనోవేదనతో కుప్పకూలి చనిపోయాడని అంటారా? అంటూ సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగితే, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాగింది. తన ఆదేశాల ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు నానా కష్టాలు పడుతున్నారని తేలింది. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరాపై తీవ్ర విమర్శలు రావడం... రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం... ఏకంగా తన సొంత జిల్లాలోనే... క్యూలైన్లో ఓ రైతు మరణించడంతో... అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటుతుందని గుర్తించిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియా సరఫరా కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌.... యూరియా సరఫరా వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకొచ్చిందంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. రైతులకు సరిపడినంత యూరియాను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి మూడు నాలుగు రోజుల్లోనే పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. రైళ్లు, లారీలు... ఏది దొరికితే దాంట్లో యూరియాను తీసుకొచ్చి, నేరుగా గ్రామాలకే తరలించాలని ఆర్డర్స్ జారీ చేశారు. అయితే, దాదాపు లక్షా15వేల టన్నుల యూరియా... ఇప్పటికే విశాఖ, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరడంతో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు ఏపీ మంత్రి పేర్నినానితో స్వయంగా మాట్లాడిన కేసీఆర్‌... పోర్టులకు అవసరమైన లారీలను పంపాలని కోరారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 3వేల లారీలను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని కోరడంతో రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో ఏపీ పోర్టుల నుంచి రైళ్లు, లారీల్లో యుద్ధ ప్రాతిపదికన యూరియాను తరలించేందుకు, వ్యవసాయాధికారులను ఆంధ్రప్రదేశ్ కు పంపాలని నిర్ణయించారు.  

తెలంగాణలో యూరియా కొరత అనే మాట వినిపించొద్దన్న కేసీఆర్‌... సమస్య పరిష్కారమయ్యేవరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. అలాగే, ప్రతి రైతుకూ యూరియా అందేవరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదిఏమైనాసరే మూడు నాలుగు రోజుల్లోనే రైతులందరికీ యూరియాను ఎట్టిపరిస్థితుల్లోనే అందించాలని కేసీఆర్ హుకుం జారీ చేశారు.