బాబుకు రిటర్న్ గిఫ్ట్... వైసీపీ అధ్యక్షుడు కేసీఆర్

 

అన్నట్టే కేసీఆర్ మాట నిలబెట్టుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని షేక్ చేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ గిఫ్ట్ ఎలా ఉంటుంది.? కేసీఆర్ ఏం చేస్తారనే దానిపై చర్చోపచర్చలు సాగాయి. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడానికి ముందుగా కేసీఆర్ వరుసగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తూ బాబుకు నిద్రలేకుండా చేస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ నిర్వహిస్తున్న సేవా మిత్ర యాప్ దుర్వినియోగం అయ్యిందని..  ఏపీ ప్రజల డేటాను ఐటి గ్రిడ్స్ అనే ఐటీ సంస్థ దొంగిలించిందని ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేసి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఇక అసలు విషయం ఏమిటంటే... కేసీఆర్ నాకు ఇస్తాను అన్న రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమిటనేగా మీ అనుమానం. అదేమిటంటే... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి దాదాపు రూ.1000 కోట్లు డబ్బులు ఇచ్చారు. హైదరాబాద్‌లో కూర్చుని కుట్రలు, కుతంత్రాలు చేస్తే మేము చేతులు ముడుచుకుని కూర్చోలేదంటూ చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము రెండు రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వకంగా వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటే... వారు (తెలంగాణ) మాత్రం దానిని అలుసుగా తీసుకుని రాష్ట్రం మీద దాడులు చేస్తున్నారన్నారు. ఓ వైపు జగన్ మోహన్ రెడ్డికి డబ్బులు పంపుతూ మరో వైపు ప్రభుత్వాన్ని అసౌకర్యానికి గురి చేసేందుకు చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణకు పోలీసులు ఉంటే, ఏపీకి కూడా పోలీసులు ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీ నుంచి రూ.5వేల కోట్ల కరెంటు వాడుకుని, ఆ డబ్బులు అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అమరావతిలో ఈరోజు ఆయన మీడియా సమావేశంలో వివరించారు. అంతే కాకుండా... ఏపీలో ప్రతిపక్షమే లేదని, అలాంటప్పుడు ఏపీకి వస్తాను తేల్చుకుంటానని కేసీఆర్ చెప్పడం విడ్డూరం అంటూనే ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదు కేసీఆర్ అని, ‘రండి, పోటీ చేయండి’ అంటూ కేసీఆర్‌కి సవాల్ విసిరారు.