ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రస్తుత సెక్రటేరియట్ భవనాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూల్చివేత పనుల వల్ల అక్కడ ఉన్న దేవాలయం, మసీదులకు ఇబ్బంది కలిగింది. సెక్రటేరియట్ భవనాలను కూల్చేస్తున్న సందర్భంగా శిథిలాలు పక్కనున్న దేవాలయం, మసీదులపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. పాత భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రార్థనా స్థలాలను చెడగొట్టడం కాదని తెలిపారు. సచివాలయం ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో ఇంతకన్నా పెద్ద దేవాలయం, మసీదులను నిర్మిస్తామని చెప్పారు. దేవాలయం, మసీదు నిర్వాహకులతో తానే స్వయంగా సమావేశమవుతానని వెల్లడించారు. నిర్మాణాల విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.

ఇదిలా ఉంటే, సచివాలయం కూల్చివేతకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని ప్రొఫెసర్ విశ్వేశర్ రావు హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు ఉల్లంగిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని, భవనాలు కూల్చివేయడం వలన వాతావరణం కాలుష్యం అవుతుంద‌ని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, సాలీడ్ వెస్ట్ మ్యానేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని ఆయన అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో సోమ‌వారం వ‌ర‌కు కూల్చివేత ప‌నులు నిలిపివేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.