మార్కెట్ యార్డుల‌న్నీ మూసివేశాం! గ్రామాల్లోనే పంట కొంటాం!

మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు చేయం! రైతుల వ‌ద్ద‌కే వెళ్ళి పంట మొత్తం, ప్ర‌తి గింజ‌, ప్ర‌తి కిలో ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తోంది. కాబ‌ట్టి రైతులు ఎవ‌రూ తొంద‌ర ప‌డ‌వ‌ద్దు. అంద‌రికీ కూప‌న్‌లు ఇస్తాం. వంతుల వారీగా వెళ్ళి రైతులు  త‌మ పంటను అమ్ముకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. రైతుల శ్రేయ‌స్సు కోసం రాజీ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ప్ర‌త్యేక మైన ప‌రిస్థితుల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సి.ఎం తెలిపారు. డ‌బ్బులు ఆన్‌లైన్‌లో రైతుల‌కు చేరుతాయి. కాబ‌ట్టి రైతుల ధాన్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మ‌ద్ద‌తుధ‌ర ఇచ్చి కొనుగోలుచేస్తామ‌ని మ‌రోసారి సి.ఎం. భ‌రోసా ఇచ్చారు. 

మార్కెట్ యార్డుల‌న్నీ మూసివేశాం. మొత్తం ధాన్యం గ్రామాల్లోనే కొనుగోలు చేస్తాం. నియంత్రిత కొనుగోళ్ళు కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తాం. కాబ‌ట్టి అన‌వ‌స‌రంగా రైతులు కొనుగోలు కేంద్రాల‌మీద ఎగ‌బ‌డ‌వ‌ద్దు. కూప‌న్ ప్ర‌కార‌మే వ‌చ్చి పంట అమ్ముకోవాలి. 40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంట తెలంగాణాలో పండింది. ప‌ద్నాల్గున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల్లో మొక్క‌జొన్న పంట పండింది. 

రైతుల పంట కొనుగోలు చేయ‌డానికి 25 వేల కోట్ల రూపాయ‌లు సివిల్ స‌ప్లాయిస్ కార్పొరేష‌న్‌కు ప్ర‌భుత్వం స‌మ‌కూర్చిందని ముఖ్య‌మంత్రి తెలిపారు. మార్కెఫెడ్‌కు మ‌రో మూడు వేల కోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.  

ఒక వేళ రైస్ మిల్ల‌ర్లు, వ్యాపార‌స్థులు పంట కొంటామ‌ని వ‌స్తే వారికి కూడా అమ్ముకోండి. అయితే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తేనే పంట అమ్ముకోండ‌ని సి.ఎం. రైతుల‌కు స‌ల‌హా ఇచ్చారు.

గ్రామాల్లోకి ఎవ‌రినీ రానివ్వ‌మంటూ మొండిగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. అయితే పంట కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చే వారిని అడ్డుకోవ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. కంచె పెట్టిన చోటే నీళ్ళు అందుబాటులో పెట్టి కాళ్ళు చేతులు క‌డిగిన త‌రువాత ఊర్లోకి రానివ్వండ‌ని సూచించారు. 

500 సెంట‌ర్‌ల‌లో హైద‌రాబాద్‌లో అన్నిర‌కాల పండ్లు అమ్మే ఏర్పాట్లు చేశామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.