చంద్రబాబు నయ వంచకుడు

 

తెరాస అధినేత కేసీఆర్‌ చంద్రబాబు,కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు.. నయ వంచకుడు. అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. తెలుగువాళ్లమంతా ఒక్కటి, మనమిద్దరం ఒకటిగా ఉంటే దిల్లీలో పట్టు ఉంటుందని కేసీఆర్‌కు చెప్పినా వినలేదు అందుకే మహాకూటమి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మహాకూటమా? కాలకూట విషమా?.. మహాకూటమా.. మన తెలంగాణను నాశనం చేసే గూటమా? అని ఎద్దేవా చేసారు.తాను, మోదీ ఒక్కటైపోయారంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ‘‘ నాలుగేళ్లు మోదీ సంకలో ఉన్నది నువ్వుకాదా? ఇన్నేళ్లు మోదీ సంకనాకింది నువ్వుకాదా? మోదీ కాళ్లుపట్టుకుని నా ఏడు మండలాలను గుంజుకున్నావు. సీలేరు పవర్‌ ప్రాజెక్టును పట్టుకుపోయావు. హైకోర్టు విభజనను అడ్డుకున్నావు’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ దెబ్బ ఏందో ఓసారి తగిలితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావ్‌. మా బతుకు మేం బతుకుతున్నాం. మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో ఆలోచించుకో. తెలుగు దేశం పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు. చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న తెలంగాణను విజయవాడకు అప్పగిస్తామా? దరఖాస్తు పట్టుకుని అమరావతి వెళ్లాలా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారు. మీ అధికారం కోసం, స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నేతలు పదవులకోసం తెలంగాణను వాడుకున్నారు.. ఆడుకున్నారు అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. బారెడు మూరెడు కబుర్లు చెప్పే జానారెడ్డి కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో తెలంగాణ కోసం ఉద్యమిద్దామని తనకు చెప్పారని కేసీఆర్‌ వెల్లడించారు.మంత్రి పదవి కోసమే తెలంగాణ అంటున్నావని జానారెడ్డి ముఖంపైనే చెప్పానన్నారు. విజయభాస్కర్‌రెడ్డి నేను అన్నట్లే జానారెడ్డిని పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే తెలంగాణ ఊసే ఎత్తలేదు.1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపింది ఎవరు? 1969లో తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిందెవరు? మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ మరణాలకు కారణం కాంగ్రెస్‌ నేతలు కాదా? మణుగూరు విద్యుత్‌ ప్లాంట్‌ విజయవాడకు తరలిస్తే కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదు. కాంగ్రెస్‌ నేతలు నల్గొండ జిల్లాను నాశనం చేశారు. ఫ్లోరైడ్‌తో లక్షా 40వేల మంది జీవితాలు నాశనమయ్యాయన్నారు.నల్గొండ ఆర్థిక ముఖచిత్రం దామచర్ల థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుతో మారుతుందని చెప్పిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 119 స్థానాలకు గాను తాజా సర్వేలో 7 స్థానాలు మజ్లీస్ కు పోగా మిగిలిన 112లో 110 టీఆర్ఎస్ వే అని చెప్పారు. నల్లగొండలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, పీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేతలకు గోచీలు ఊసిపోవడం ఖాయమన్నారు.