నేతన్నలకు 24వేలు... మత్స్యకారులకు 10వేలు... జగన్ సర్కారు సంచలన నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని హామీల అమలు దిశగా తీర్మానాలు చేసింది. ముఖ్యంగా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల కోసం వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తోన్న ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా 24వేల రూపాయల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. డిసెంబర్ 21నుంచి వైఎస్సార్ చేనేత నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే, వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు 10వేలు చొప్పున ఆర్ధికసాయం చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. అదేవిధంగా మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌పై 9 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు.

ఇక, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ మంత్రివర్గం... హోంగార్డుల రోజువారీ వేతనాన్ని 710 రూపాయలకు పెంచింది. దాంతో హోంగార్డుల నెల వేతనం 18వేల నుంచి 21వేల 300కి చేరనుంది. అదేవిధంగా బార్ అసోసియేషన్స్‌లో సభ్యత్వమున్న న్యాయవాదులకు నెలకు 5వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక, జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం... మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన పలాస ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతి తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి... ప్రభుత్వమే హామీగా ఉండి... రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కములకు ఊరటనిచ్చేందుకు... 4వేల 471కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.