అధికారులపై సీఎం జగన్ ఫైర్.. వైఎస్సార్ పేరు తొలగించండి!!

 

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముందుగా చేసే పని.. పథకాలకు పేర్లు, భవనాలకు రంగులు మార్చడం. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ కూడా అదే చేసింది. పలు పథకాలకు పేర్లు మార్చింది. సీఎం జగన్.. ఆయన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని పథకాలకు జోడించారు. ఇక రంగుల సంగతి సరేసరి. పలు ప్రభుత్వ భవనాలను వైసీపీ జెండా రంగులు కప్పేశాయి. అత్యుత్సాహానికి పోయి కొన్ని చోట్ల.. స్మశానాలు, బోరు పంపులకు కూడా పార్టీ జెండా రంగులు వేశారు. ఒక గ్రామంలో అయితే ఏకంగా జాతీయ జెండా రంగులనే తమ రంగుతో కప్పేశారు. వీటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా రంగు పడుతూనే ఉంది. అయితే తాజాగా వైసీపీ సర్కార్ కి ఓ పెద్ద తలనొప్పి వచ్చి పడింది. చివరికి సీఎం జగన్ రంగంలోకి దిగి వైఎస్సార్ పేరుని తొలగించండని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. నవంబర్ 11న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకునే.. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డుల’ పేరును ‘వైఎస్‌ఆర్ విద్యా పురస్కార అవార్డులు’గా మార్చుతూ సోమవారం నాడు అధికారులు జీవో జారీ చేశారు. అయితే ఈ జీవో పెను దుమారమే రేపింది. విద్యార్థులను, యువతను ఎంతో ప్రభావితం చేసిన అబ్దుల్ కలాం పేరుని తొలగించడం ఏంటని విమర్శలు వ్యక్తమయ్యాయి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా అందరూ ఎంతో గౌరవించే వ్యక్తి పేరుని తొలగించి ఇంతలా అవమానపరుస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

జీవో రావడంతోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడంతో.. సీఎం జగన్ అధికారులపై ఫైర్ అయ్యారు. అసలు తన దృష్టికి తీసుకురాకుండా పేరు ఎందుకు మార్చారంటూ మండిపడ్డారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని సూచించారు. మరికొన్ని అవార్డులకు కూడా మహనీయుల పేర్లు పెట్టాలని సీఎం ఆదేశించారు. గాంధీ, అంబేద్కర్, పూలే, జగ్జీవన్‌రామ్‌ పేర్లతో అవార్డులు ఇవ్వాలని జగన్‌ సూచించారు.