ఆర్టీసీ రేసులో అంబటి, లక్ష్మీపార్వతి... మరి జగన్ మొగ్గు ఎవరి వైపో?

 

ఎన్నికలకు ముందు పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తూ, చంద్రబాబుపై విరుచుకుపడిన వారందరికీ దాదాపు పదవులు కట్టబెట్టారు జగన్. పలువురికి పిలిచిమరీ పోస్టులిచ్చారు. అయితే, చంద్రబాబుపై ప్రత్యేక అస్త్రంగా ప్రయోగించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి మాత్రం ఇంకా ఏ పదవీ ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎందుకంటే, చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శిస్తూ వైసీపీ వాయిస్ ను బలంగా వినిపించిన తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. అయితే, ఎన్నికల టైమ్ లో లక్ష్మీపార్వతి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ, అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారట. అయితే, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదారు నెలలు కావొస్తున్నా, తనను అసలు పట్టించుకోవడం లేదని, కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబును తిట్టడానికి మాత్రం వాడుకున్నారని కినుక వహించారని తెలుస్తోంది.
  
అయితే, వైసీపీ స్థాపించిననాటి నుంచి వెంటనడిచిన లక్ష్మీపార్వతికి ఏదోఒక పదవి కట్టబెట్టాలని జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, లక్ష్మీపార్వతి కోసం ఒక పోస్టును సిద్ధంచేస్తున్నట్లు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఏదోఒక కార్పొరేషన్ కు ఛైర్మన్ గా పంపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అయితే, కీలకమైన ఈ నామినేటెడ్ పోస్టు కోసం మరికొందరు పోటీపడుతున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు రేసులోకి వచ్చారట. మంత్రి పదవి దక్కకపోవడంతో కనీసం ఆర్టీసీ ఛైర్మన్ పదవైనా ఇవ్వాలని అంబటి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

అంబటి రేసులోకి రావడంతో లక్ష్మీపార్వతికి ఇప్పట్లో పదవి దక్కేది అనుమానమేనంటున్నారు. కోడెలను ఓడించడమే కాకుండా, పార్టీకి బలమైన గొంతుగా పనిచేసిన అంబటికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశముందంటున్నారు. మరి, ఆర్టీసీ స్టీరింగ్ ఎవరికి దక్కుతుందో, ఛైర్మన్ గిరిని జగన్ ఎవరికి కట్టబెడతారో చూడాలి. అయితే, అంబటి, లక్ష్మీపార్వతిల్లో ఎవరో ఒకరికి ఆర్టీసీ పగ్గాలు దక్కుతాయో లేక మరొకరికి ఆఫర్ చేస్తారోనన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది.