వారోత్సవాలు అయ్యే వరకు ఎంత ఇసుక కావాలంటే అంత ఇవ్వండి: సీఎం జగన్

 

వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఇసుకను జనానికి అందుబాటులో ఉంచుదామని ఏపీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశించారు సీఎం జగన్. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుంది సర్కార్. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వమించాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద తగ్గడంతో సరఫరా పెంచి వారం రోజుల పాటు ఈ అంశంపైనే పూర్తిగా దృష్టి సారించి అడిగిన వారికి అడిగినంత ఇసుక సరఫరా చేయాలని సూచించారు. ఏపీలో ప్రస్తుతం రోజుకు లక్షా ఇరవై వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. వారం రోజుల్లో దీనిని రెండు లక్షల టన్నులకు పెంచేందుకు ఇసుక వారోత్సవాల్లో ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. 

280 రీచ్ లలో ప్రస్తుతం 99 ఆపరేషన్ లో ఉండగా 21వ తేదీనాటి వరకు 140కి పెంచేలా జాయింట్ కలెక్టర్ లకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలను ఖరారు చేసి రెడ్ కార్డ్ లను ప్రదర్శించబోతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా ఇసుకను స్టాక్ యార్డుల్లో సిద్ధంగా ఉంచబోతున్నారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఎవరు విక్రయించినా ఇసుకను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. దీనికి తోడు అపరాధ రుసుముతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధిస్తామన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుకని నిల్వ చేసే అధికారంగాని, అమ్మే అధికారంగాని మైనింగ్ డిపార్ట్ మెంట్ కు మాత్రమే ఉంది తప్పితే ఎటువంటి వ్యక్తులకు గాని, సంస్థలకు గాని లేదు. కనుక ఇసుక నిల్వ చేసి అక్రమంగా రవాణా చేసినా.. అక్రమంగా నిల్వ చేసినా.. బ్లాక్ మార్కెటింగ్ చేసిన పునర్విక్రయం చేసినా కూడా ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఇసుక వారోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఇసుక కొరత తీరే వరకు సంబంధిత విభాగాల్లో ఉద్యోగులెవ్వరూ సెలవులు తీసుకోరాదని సీఎం సూచించారు. సరిహద్దుల్లో ప్రతి చోట చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేపట్టారు అధికారులు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినా నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.