మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.... టీఆర్ఎస్ లో రచ్చకెక్కిన విభేదాలు...

ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. మహబూబాబాద్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు తెలియకుండా రివ్యూ మీటింగ్ పెట్టడంపై శంకర్ నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు మీకు తెలుసా, నాకు తెలుసా అంటూ మంత్రిపై శంకర్ నాయక్ మండిపడ్డారు. రివ్యూ మీటింగ్ అంటే నాలుగు మాటలు మాట్లాడి ఫోటోలు దిగి వెళ్లిపోవడం కాదంటూ నిప్పులు చెరిగారు. దాంతో, కంగుతిన్న మంత్రి సత్యవతి రాథోడ్... సమష్టిగా పని చేద్దాం, సమస్యలు చెప్పండి అంటూ కౌంటరిచ్చారు.

మంత్రి మాటలపై శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మధ్యలో కలెక్టర్ గౌతమ్ జోక్యం చేసుకున్నారు. సమాచారమివ్వకుండా రివ్యూ మీటింగ్ నిర్వహించడంపై శంకర్ నాయక్ కు ... కలెక్టర్ క్షమాపణ చెప్పారు. దాంతో, కలెక్టర్ స్థాయి వ్యక్తి సారీ చెప్పడం సరికాదన్న శంకర్ నాయక్.. హడావిడిగా రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అయితే, శంకర్ నాయక్ తీరుపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇరువురి వాగ్వాదంపై సమావేశం గందరగోళంగా మారింది. సమస్యలు మీరు చెప్పండి అంటే, మీరు చెప్పండి అంటూ ఎమ్మెల్యే, మంత్రి వాదులాడుకున్నారు. దాంతో కలెక్టర్... కలుగజేసుకుని ఎమ్మెల్యే, మంత్రిని శాంతింపజేశారు.