మంత్రికి జరిమానా

 

మన ఇండియాలోనే మంత్రులకు లేనిపోని బిల్డప్పులుగానీ, అమెరికాలో ఎవరైనా ఒకటే. తన ఇంటి ముందు ఉన్న మంచు కుప్పను తొలగించనందుకు అమెరికా అధికారులు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీకి జరిమానా విధించారు. గత వారం రోజులుగా వాషింగ్టన్‌ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తోంది. ఎవరి ఇంటి ముందు కురిసిన మంచును వారే తొలగించుకోవాలనే నిబంధన వుంది. అయితే జాన్ కెర్రీ మాత్రం తన ఇంటి ముందు వున్న మంచును తొలగించుకోలేదు. దాంతో అధికారులు ఆయనకు 50 డాలర్ల జరిమానా విధించారు. అయితే జాన్ కెర్రీ దీనికి ఎంతమాత్రం అభ్యంతరం చెప్పకుండా జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. అయినప్పటికీ, మంచు బాగా కురిసిన సమయంలో తాను అమెరికాలో లేనని, అధ్యక్షుడు ఒబామాతో కలసి సౌదీ అరేబియాలో వున్నానని వివరణ కూడా ఇచ్చారు. ఇదే మన దేశంలో అయితేనా... జరిమానా విధించిన అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేవరకూ మనవాళ్ళు ఊరుకునేవారా?