చిరు ఫ్యాన్స్ కి దారేది?

 

 

 

చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఫ్యాన్స్ కింగుల్లా తిరిగేవారు. చిరంజీవి ఫ్యాన్ అంటే సమాజంలో కాస్తంత క్రేజ్, ఇంకాస్త భయం వుండేది. ‘నేను చిరంజీవి ఫ్యాన్’ అని చెప్పుకోవడానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరేవారు..గర్వపడేవారు. చిరంజీవిని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా పళ్ళు రాలగొట్టడానికి రెడీగా వుండేవాళ్ళు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటరై అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ కి విలువ సంగతి దేవుడెరుగు.. జనాల్లో సాక్షాత్ చిరంజీవికే విలువ లేకుండా పోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది మరింత అట్టడుగుకి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘నేను చిరంజీవి ఫ్యాన్‌ని’ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిని ఆయన అభిమానులు ఎదుర్కొంటున్నారు. అందుకని అందరూ సేఫ్ సైడ్‌గా పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ వైపు షిఫ్టయ్యారు.

 

లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సొంతగా రాజకీయ కుంపటి పెట్టుకుని అన్నయ్యకి, ఆయన పార్టీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తూ వుండటంతో  ఇప్పుడు చిరు ఫ్యాన్స్ కి చిరు, రామ్ చరణ్ వైపు వుండాలా? లేక పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్‌కి తమ మద్దతు లేదని చిరు కుటుంబం ప్రకటించడంతో, గురువారం నాడు పవన్ వైజాగ్‌లో నిర్వహించే సభకి వెళ్ళాలా లేక హైదరాబాద్‌లో వున్న రామ్‌చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలా అని ఫ్యాన్స్ డోలాయమాన స్థితిలో వున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఫ్యాన్స్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ ఇబ్బందిని అర్థం చేసుకున్న రామ్ చరణ్ తానే ముందుకు వచ్చి ఈసారి తన బర్త్ డేకి రాకపోయినా పర్లేదుగానీ, బాబాయ్ మీటింగ్‌కి వెళ్ళండని ఫ్యాన్స్ కి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ చెప్పారా లేదా అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది.

పవన్ వైపే పూర్తిగా మొగ్గు చూపిన కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. ఏం చేయాలో అర్థంకాని చాలామంది ఫ్యాన్స్ మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చోవాలని డిసైడైనట్టు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ కళ్యాణ్ మీటింగ్ డే, రామ్ చరణ్ బర్త్ డే ఒకేరోజు రావడంతో ఫ్యాన్స్‌ అయోమయానికి గురయ్యారు.