కర్ణుడి చావుకి వెయ్యి శాపాలు.. చిరంజీవి ప్రచారానికి..

 

 

గత వారం రోజులుగా చిరంజీవి & ట్రూప్ వారు ప్రదర్శిస్తున్న మెగా కాంగ్రెస్ షో ప్రేక్షకులు లేక ఘోరంగా ఫ్లాప్ అయి అర్ధాంతరంగా ముగుస్తుండటంతో ఆయన్నే నమ్ముకొని గోదారి దాటేద్దామని ఆశపడిన కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేయాలో తెలియక తలపట్టుకోంది. కాంగ్రెస్ పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేఖతకి తోడు రాష్ట్ర విభజన వ్యవహారంలో, ఆయన మూటగట్టుకొన్నఅపఖ్యాతి కూడా ఆయన ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చును. అందుకే ఆయన ప్రచారానికి జనాలు మొహాలు చాటేశారు.అయినా రాష్ట్ర విభజనతోనే కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో ప్రజలు అకౌంటు క్లోజ్ చేసేసారని తెలిసినప్పటికీ అదేమీ తెలియనట్లు నటిస్తూ వారు వచ్చినంత మాత్రాన్న ప్రజలు తమ అభిప్రాయాలు మార్చేసుకొంటారని చిరంజీవి & ట్రూప్ అనేసుకోవడం అత్యాసే.

 

ఇక చిరంజీవి తన ప్రచారంలో చేస్తున్న అర్ధం లేని అసందర్భ ప్రసంగాలతో ఉన్న జనాలు కూడా పారిపోతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలందరూ కట్టకట్టుకొని ఏసీ బస్సు వీసుకొని ప్రచారానికి బయలుదేరినా వారిలో ఒక్కరికీ కూడా ప్రజలలో మంచి పేరు కానీ, గుర్తింపు గానీ లేకపోవడం, గుర్తింపు ఉన్న చిరంజీవికి నోటి శుద్ధి లేకపోవడంతో జనాలు కరువయ్యారు.  ఒకప్పుడు లక్షలాది ప్రజలు రోడ్ల మీదకు రెండున్నర నెలల పాటు ఉద్యామాలు చేసినప్పుడు వారి అభిప్రాయాలకు పూచికపుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ప్రజలు బాజాభజంత్రీలతో ఘన స్వాగతం చెపుతారని అనుకోవడం కూడా అత్యాసే కదా! అయినా ప్రజలు ఇప్పటికీ తెదేపా, వైకాపా, కొత్తగా రంగంలోకి దిగుతున్న జనసేన పార్టీల మధ్యన ఎప్పుడో చీలిపోయారు. అందువలన ఇప్పుడు ఏ జీవి వచ్చినా కాంగ్రెస్ పార్టీని కాపాడటం అసాధ్యం అని అధిష్టానం గ్రహించగలిగితే, వేరే కొత్త ఆలోచన ఏదయినా చేసుకొనే వీలుతుంది.