అన్నదమ్ముల సవాల్

 

పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం వేదికా రెండూ ఖరారయిపోయాయి. మార్చి14, హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్ లో ఆయన వర్తమాన రాజకీయాలపై ప్రసంగించిన తరువాత తన పార్టీని ప్రకటిస్తారు.

 

ఇక ఆయన పార్టీ పెట్టడంపై రామ్ చరణ్ స్పందిస్తూ “బాబాయి పార్టీ పెట్టడం అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. నాకు రాజకీయాలపై సరయిన అవగాహన లేదు. నేను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఆయనకు ఎప్పుడు మద్దతు ఇస్తాను. అయితే రాజకీయంగా నాన్నగారికే మద్దతు ఇస్తాను,” అని అన్నారు. రామ్ చరణ్ మాటలను బట్టి చూస్తే, ఈ విషయంలో మెగా కుటుంబంలో మరి కొంత దూరం పెరగబోతోందని స్పష్టమవుతోంది.

 

నిరుడు ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరపున ప్రచారంలో పవన్ కళ్యాణ్ “కాంగ్రెస్ నేతలందరినీ పంచెలూడదీసి తరిమితరిమి కొట్టాలి” అని ఎద్దేవా చేసారు. కానీ తను ఎంతో ఉన్నతంగా ఊహించుకొన్న అన్నగారు చిరంజీవి కేంద్రం మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ షాకయ్యాడు. అప్పటి నుండే వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మళ్ళీ మొన్న రాష్ట్ర విభజన సందర్భంగా చిరంజీవి వ్యవహరించిన ద్వంద వైఖరితో ఆయనకు మానసికంగా కూడా దూరమయ్యాడు. ఆవిషయం మొన్న నాగబాబు కుమారుడు సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో స్పష్టంగా బయటపడింది.

 

ఇప్పుడు అన్నగారు చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా పోరాడేందుకు ఆయన పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతుండటంతో ఇక ఆ దూరం మరింత పెరిగి ఎన్నికల సమయానికి అది శత్రుత్వంగా మారే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయకపోడు. అప్పుడు కాంగ్రెస్ నేతలు అతను చిరంజీవి సోదరుడని విడిచిపెట్టలేరు కనుక వారు తీవ్రంగానే విమర్శించవచ్చును. ఇది మెగా బ్రదర్స్ ముగ్గురికీ, వారి కుటుంభ సభ్యులకు, వారి అభిమానులకు కూడా చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు కల్పించడం ఖాయం.