చిరంజీవికి అభిమానులు మళ్ళీ గుర్తువచ్చారు

 

 

గత ఎన్నికల దెబ్బకి ప్రజారాజ్యం పార్టీని, దాని ఆశయాలను, చివరికి తన అభిమానులను కూడా  మరిచిపోయిన చిరంజీవి అనే ఓ మెగాజీవి కాంగ్రెస్ గంగలో మునిగి పునీతులయిపోయారు. ఆ పుణ్యఫలం వలన అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వచ్చిన ఆ జీవి మరెన్నడూ తన అభిమానులని పట్టించుకోకపోయినా, వారు మాత్రం టంచనుగా ఆయన పుట్టిన రోజు, ఆయన కొడుకు పుట్టిన రోజులని కూడా గ్యాపకం పెట్టుకొని తమ రక్తం ధార పోస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన వ్యవహారం బెడిసికొట్టిన తరువాత, తమ్ముడు పవన్ కొట్టిన దెబ్బతో మళ్ళీ ఆయన మెల్లమెల్లగా అభిమానులను గుర్తుపట్టగలుగుతున్నారిపుడు. అందుకే మళ్ళీ అందరినీ పేరుపేరునా పిలుస్తూ తమ్ముడు పెట్టే సమావేశానికి వెళ్ళవద్దని కూడా చెప్పగలిగారు.

 

అయితే వారిలో చాలా మంది ఆయన తమను గుర్తిస్తున్నాడని సంతోషించకపోగా, వారు కూడా ఆయనపేరు మరిచిపోయినట్లు ఆయన బస్సు యాత్రలో కనబడినప్పుడల్లా ‘పవన్ కళ్యాణ్ కి జై!’ అని అరుస్తూ తాము కన్ఫ్యూజ్ అయిపోతూ ఆయనను కూడా తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇంకా వారినలాగే వదిలేస్తే ఇక శాశ్వితంగా తమ్ముడికే జై కొడుతూ తనపేరు కూడా మరిచిపోయే ప్రమాదం ఉందని, భయపడిన చిరంజీవులవారు, రఘువీరుడు, వసంత కుమారుడు వెంటరాగా ఈరోజు తన అభిమాన సంఘాలతో ఒక మీటింగ్ వేసుకొన్నారు.

 

చిల్లుపడిన కుండలా మారిన పార్టీలో నుండి మిగిలినవారు కూడా జారిపోకముందే అభిమానులందరికీ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పేస్తే వారు మరెవరి వెనుకపోకుండా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీలోనే పడి ఉంటారని మంచి ఐడియా కూడా చేసారు. కానీ ఆ గుప్పెడు మందితో కాంగ్రెస్ పార్టీని నడపడం చాలా కష్టం గనుక వారందరి చేతికీ కాంగ్రెస్ టోపీలు ఇచ్చి వీలయినంతమంది అభిమానులకి, జనాలకి కూడా అవి పెట్టి వారిని పార్టీలోకి తోలుకురమ్మని సాక్షాత్ కేంద్రమంత్రి చిరంజీవే చేతులు పట్టుకొని అభ్యర్ధించేసరికి వాళ్ళు కూడా ఐస్ అయిపోయారుట.

 

ఎప్పుడూ ఎక్కడో డిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర ఆయన చేతులు కట్టుకొని వినయంగా వంగి నిలబడగా టీవీలలో చూడటమే తప్ప ఇలా తమ ముందు కూడా వినయంగా నిలబడి, ఆప్యాయంగా భుజాల మీద ఆయన అమృత హస్తాలు వేయడం ఎన్నడూ ఎరుగని అల్పసంతోషులు, ఆయన బొమ్మున్న ‘కేసీ క్రూ’ బ్యాడ్జీలు మెడలో వేసుకొని ‘జై చిరంజీవ!’ అంటూ వీరావేశంతో ఊగిపోయారుట. కేసీఆర్ రాష్ట్రాన్నే విడదీస్తే ఈ కేసీ బాబు మాత్రం కేవలం అభిమానులనే విడదీస్తే చాలు మన పనయిపోతుందని అనుకొంటున్నారుట.

 

కానీ లక్ష్మణుడు వంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం “పాపం! అన్నయ్యను తప్పుపట్టడానికేమీ లేదు.. ఆ సోనియమ్మే అమాయకుడైన మా అన్నయ్యను వెనక నుండి రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తోంది. అసలు ఆయనకి మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చారు గనుకా..” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ భలే తమ్ముడు అనిపించుకొన్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన మనసు మార్చుకోక పోతాడా? ఎన్నికలలో పోటీ చేయబోడా..అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు.