చిరు అబ్బ దబ్బ జబ్బ ..

 

పుట్టు మూగ.. 40 ఏళ్ళ వయస్సులో వైద్యంతో మాట వస్తుంది. ఇక చూడాలి. చిన్నప్పటి నుంచి మాట్లాదలనుకున్నవన్నీ ఒక్కసారిగా మాట్లాడేస్తుంది. అప్పటివరకూ అబ్బ దబ్బ జబ్బ పదాలు విన్న భర్త భార్యామణి మాటల వరదతో చెవులు చేటంత అవుతాయి. ఇదో ఓ తెలుగు సినిమాలో కామెడీ సీను. సేమ్ టు సేమ్ కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఇలాగే మారిపోయారు.

 

విభజన ప్రకటన సంప్రదింపుల సమయంలో యూటీ కోసం ప్రయత్నిస్తా.. రాజీనామా చేస్తా.. సమైక్యం కోసం కృషి చేస్తా.. వంటి మూడో, నాలుగో మాటలు మాట్లాడేవారు..ఇప్పుడు అంతా అయిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ కు సినిమా కనిపిస్తోంది. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ భాద్యతలు భుజాన వేసుకుని బస్సు యాత్రకు బయలుదేరారు చిరంజీవి అండ్ కో.

 

ఈ యాత్రల్లో చిరు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నవి, అప్పుడే చెప్పాల్సినవి.. ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని మరీ బస్సు ఆగిన ప్రతి చోటా చెబుతున్నారు. బొత్స ఆస్తులపై దాడుల వెనుక అప్పటి సీఎం కిరణ్ ఉన్నారని విజయనగరం సభలో, కిరణ్ నమ్మకద్రోహం చేశాడని రాజమండ్రిలో, కేంద్ర మంత్రులమైన తమనీ మోసం చేశాడని ఏలూరులో , పదవులు అనుభవించి కొందరు వెళ్లిపోయారని విజయవాడలో అయిపోయిన సంగతులు చెబుతున్నాడు లేటెస్ట్ గా అనంతపురంలో విభజన చేయాలనే ఆలోచన కాంగ్రెస్ కు లేదని, టీడీపీ.. వైసీపీ లు పట్టుపట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఇచ్చిన లేఖలను కూడా తీసుకొచ్చారు.

 

ఈ సంఘటనలు అన్నీ జరిగినప్పుడు మాట్లాడా లనుకుని ఎవరైనా ఫీలవుతారని మౌనంగా ఉండిపోయి ఉంటాడని, అవన్నీ ఇప్పుడు గట్టు తెగిన గోదావరిలా ఉబికి వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటుంటే .. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం మన చిరు కూడా అబ్బ దబ్బ జబ్బే అని ముసిముసిగా నవ్వుకుంటున్నారు.