చిరు మీటింగుకెళ్తే అంతేనా?

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ వుంది. మాజీ మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాకైనా క్లాప్ కొట్టాడంటే ఆ సినిమా ఫ్లాప్ డిసైడైపోతుంది. అందుకే సినిమా ప్రారంభోత్సవాల్లో ఆయన చేత క్లాప్ కొట్టించే సాహసం ఎవరూ చేయరు. అదేంటోగానీ, అడపాదడపా ఆ సాహసానికి ఒడికట్టినవారు భారీ మూల్యాన్ని చెల్లించిన దాఖలాలు అనేకం వున్నాయని సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ వుంటాయి.

 

అలాగే చిరంజీవి విషయంలో ఒక విషాదకర వాస్తవం వుంది. చిరంజీవి హీరోగా వుండగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, ఆడియో ఫంక్షన్లు, శతదినోత్సవాలకు ఊళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చినవారు క్షేమంగా తిరిగి వెళ్తారన్న గ్యారంటీ వుండదంటారు. ఎందుకంటే చిరంజీవి ప్రోగ్రాములకు హాజరై తిరిగి ఇళ్ళకు వెళ్తున్న ఎంతోమంది అభిమానులు యాక్సిడెంట్లకి గురై తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అందుకే ఓసారి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా చిరంజీవికి సంబంధించిన ఏదైనా ఫంక్షన్ జరుగుతూ వుంటే, దానికి అభిమానులు తరలి వస్తుంటే తనకి ఎంతో భయం వేస్తూ వుంటుందని చెప్పారు.

 

చిరు ఫంక్షన్స్‌ కి వచ్చే అభిమానులు జాగ్రత్తగా ఇళ్ళకు తిరిగి వెళ్ళాలని కోరుకున్నారు. చిరు హీరోగా వున్నప్పటి పరిస్థితి ఇలా వుండగా, అయ్యగారు ప్రజారాజ్యం పార్టీని వెలగబెట్టినప్పుడు రాష్ట్రమంతా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంతోమంది ఆయన అభిమానులు కరెంటు షాక్‌లు తగిలో, ఆయన మీటింగ్‌లకి వచ్చేటప్పుడో, వెళ్ళేటప్పుడో యాక్సిడెంట్లు జరిగి మరణించిన సందర్భాలు చాలా వున్నాయి. ఇలా అభిమానులు చనిపోవడం, వాళ్ళ ఇళ్ళకు నాగబాబు వెళ్ళి సానుభూతి ప్రకటించడం అప్పట్లో ఆనవాయితీగా వుండేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, నెల్లూరులో చిరంజీవి మీటింగ్‌లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. చిరంజీవి ప్రసంగం వినడానికి వచ్చిన ఓ అభిమాని గుండెపోటుతో మీటింగ్ మధ్యలోనే మరణించాడు. ఇలాంటి దుర్ఘటనలు మరికొన్ని జరిగితే జనం చిరంజీవి మీటింగ్‌లకి వెళ్ళాలంటే భయపడిపోవడం ఖాయం.