చిరంజీవి అండ్ ట్రూప్ వారి ఉత్తర కుమార ప్రగల్భాలు

 

చిరంజీవి వెండి తెర మీద ఆడిపాడితే అదొక రకమయిన వినోదం. అదే కాంగ్రెస్ కండువా కప్పుకొని బస్సుయాత్ర చేస్తూ ప్రజల ముందు పంచ్ లేని డైలాగ్స్ కొడితే అది మరొక రకమయిన కామెడీ. రెండూ వినోదం పంచేవే. మొదటి దానికి ప్రజలు డబ్బు చెల్లిస్తే, రెండో దానికి కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తోంది! చిరంజీవి అండ్ కో ట్రూప్ నెల్లూరు చేరుకొంది. యధాప్రకారం స్టేజి మీద ఉన్నంత మంది క్రిందన లేకపోయినా నిరుత్సాహపడకుండా ఇది రోడ్ షో కాదు, కార్యకర్తల సమావేశమని అందరికీ సర్దిచెప్పుకొని తన ప్రోగ్రాం షురూ చేసేసారు మెగా జీవిగారు.

 

ముందుగా సీమాంద్రాను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబును ఎంచుకొని, మరి తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదని ‘లా పాయింటు’ లేవనెత్తారు. కానీ తన పక్కనున్న ‘రఘువీరుడు’ అంతక్రితం జరిగిన సమావేశంలోనే “గత అరవై ఏళ్లుగా తమ కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని వచ్చే పదేళ్ళలో చేసేస్తామని” చెప్పిన సంగతి మరిచిపోయారు. అటువంటప్పుడు కేవలం తొమ్మిదేళ్ళే పాలించిన చంద్రబాబు ఏదో ప్రజలను వినోదింపజేయడానికి సింగపూరు పిక్చరు వేసి చూపిస్తే తప్పేమిటి? అని గుప్పెడు ప్రేక్షకుల ప్రశ్న.

 

అసెంబ్లీలో నోరే విప్పని చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి అంటారేమిటి? అని మరో ధర్మ సందేహం వ్యక్తం చేసాడు ఆ మెగాజీవి. నిజమే! చంద్రబాబు నోరు మెదపలేదు. సరే! కానీ రాష్ట్ర విభజనకు వ్యతిరేఖిస్తూ రాజీనామా కూడా చేసిన ఈ మెగాజీవి హైదరాబాదుని యూటీ ఎందుకు చేయమన్నట్లు? విభజన బిల్లుకి మద్దతు ఎందుకు ఇచ్చినట్లు? మరక మంచిదే అని ఏదో బట్టలసబ్బుల ప్రకటనలాగ విభజన మంచిదేనని ఇప్పుడు ఎందుకు వితండ వాదం చేస్తున్నట్లు? నేటికీ కేంద్రమంత్రి పదవిలో ఎందుకు కంటిన్యూ అయిపోతున్నట్లు? అని ప్రజలకు కూడా అనేక ధర్మసందేహాలు కలుగుతున్నాయి.

 

ఇక మెగాజీవి గారు జగన్ జైల్లో ఉన్నపుడే వైకాపా పరిస్థితి బాగా ఉందని వెటకారం చేసారు. కానీ తను బయట ఉండి కూడా ప్రజారాజ్యం పార్టీని  గట్టిగా రెండేళ్ళు నడపలేక చేతులెత్తేసి, కాంగ్రెస్ హస్తంలో పార్టీని పెట్టేసి కేంద్రమంత్రి పదవితో పునీతులయిన సంగతి మరిచిపోయి, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి కూడా పార్టీని బాగా నడపగలిగారని అంగీకరించడం చాలా గొప్ప విషయమే.

 

ఇక చంద్రబాబు రండి బాబు రండి అని పిలుస్తుంటే... జగన్ బాబు నిధులు తెండి బాబు తెండి అని అంటున్నారని ఎద్దేవా చేశారు. నిజమే..ఎవరి బాధలు వారివి. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేవారు లేకనే కదా.. ఇప్పుడు ఈ కాంగ్రెస్ జీవులన్నీ ఏసీ బస్సేసుకొని రోడ్డున పడవలసి వచ్చింది. జనాల మాట దేవుడెరుగు కనీసం తమ గోడు వినేందుకు పదిమంది కార్యకర్తలు వచ్చినా చాలని వారు ఆరాటపడటం లేదా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు చుట్టూ జనాలు తిరిగే పరిస్థితి నుండి జనాల చుట్టూ కాంగ్రెస్ నేతలు తిరిగే దుస్థితికి అద్దం పడుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రలో కూడా మరి ఈ ఉత్తరకుమార ప్రగల్భాలు ఎందుకు?

 

విజయనగరంలో ఆయనతో బస్సెక్కిన బొత్స వారు అక్కడే దిగిపోవడమే కాకుండా త్వరలోనే వేరే బస్సేక్కేందుకు బ్యాగులు సర్దుకొంటున్నట్లు తాజా వార్త. అదే నిజమయితే ఆయన పేరును కూడా కాంగ్రెస్ ద్రోహుల జాబితాలో చేర్చి వారందరి గోత్రానామాలతో పాటు బొత్స పేరును కూడా తరువాత స్టేజి నుండి స్మరించు కొంటారేమో.. అందువల్ల కనీసం బస్సులో ఉన్నవారయినా యాత్ర పూర్తయ్యేలోగా మధ్యలో ఎక్కడా దిగిపోకుండా కాపాడుకోగలిగితే అదే పదివేలు. అలాకాదని బ్లడ్డ్ బ్యాంకులున్నాయి కదా అని పదే పదే కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తానని అంటే జనాలు నవ్విపోతారు చిరంజీవి గారు.