శాస్త్రం ఒప్పుకోదు మరి, అయినా తప్పలా ఆ జీవికి

 

సాధారణంగా మన తెలుగువారు ఎవరయినా చనిపోయిన వారింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి నేరుగా మళ్ళీ తమ ఇంటికే వెళ్లి శుద్ధిస్నానం చేసిన తరువాత గానీ మరెవరి ఇళ్ళకు వెళ్లరు. అయితే, ఈ సాంప్రదాయం మరి అధికారిక కార్యక్రమాలకు కూడా వర్తిస్తుందో లేదో మన చట్టాలలో వ్రాయడం మరిచిపోయారు మన రాజ్యాంగనిర్మాతలు. ప్రత్యేక విమానం వేసుకొని, నేలమీద ఎక్కడా కాలుపెట్టకుండా ఆకాశంలో గిరగిరా తిరిగేస్తూ, దేశ సేవలో, ప్రజాసేవలో నిమగ్నమయిపోయిన మన కేంద్రమంత్రి గారు చిరంజీవిగారు, ఉత్తరాఖండ్ వరదలలో చిక్కుకొని చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఓదార్పు కార్యక్రమాన్ని తన డైరీలో చూసుకొన్న వెంటనే, ఒక ప్రత్యేక విమానం వేసుకొని హడావుడిగా గన్నవరం విమానశ్రయంలో వాలిపోయారు.

 

వారిని ఒదార్చేసిన తరువాత, వెంటనే గుంటూరు వెళ్లి అక్కడ వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఒక శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన అమృత హస్తలతోనే చేయవలసి ఉంది. అయితే, ఇక్కడే ఆయన ఓదార్పు యాత్రకి శాస్త్రం అడ్డుపడింది. అటువంటి కార్యక్రమాలకి హాజరయిన తరువాత, ఎంత పట్టుపంచె కట్టుకొని, ఉత్తరీయం కప్పుకొని వెళ్ళినా శుభమా అంటూ వెళ్లి కొబ్బరి కాయలు కొట్టవచ్చునా? అనే ధర్మసందేహం మంత్రి కన్నావారికి కలగడంతో, ఆయన అదే విషయాన్నిచిరు చెవిలో ఊదేసరికి, మరో ఆలోచన చేయకుండా అయితే ‘ప్రోగ్రాం క్యాన్సిల్!’ అనేసి మళ్ళీ ప్లేను ఎక్కేయబోయారు. కానీ, ఆయన ఓదార్పుకోసం అక్కడ బాధితులు అందరూ కడుపులోదుఃఖము ఉగ్గబట్టుకొని ఎదురు చూస్తున్నారని, ఆయన వెళ్ళకపోతే వారు ఇంకా చాలా దుఃఖపడిపోతారని విజయవాడ శాసన సభ్యుడు మల్లాది విష్ణు చెప్పడంతో, పెదమంత్రిగారి మనసు చెరువయిపోయింది.

 

అయితే శాస్త్రం ఒప్పుకోక పోవడంతో దానిలో ఏమయినా యమండ్మెంట్స్ ఉన్నాయోమో అని అందరూ కొంత సేపు తర్జనబర్జనలు పడ్డారు. అయితే, కలియుగంలో ఒకానొక పెదమంత్రిగారికి ఇటువంటి సమస్య తలెత్తుతుందని మన పెద్దలు ముందే ఊహించలేకపోవడంతో, పర్టిక్యులర్ గా అటువంటి క్లాజులు ఏమి వ్రాసిపెట్టలేదు.

 

శాస్త్రం లోతుపాతులు తెలియకపోయినా సంప్రదాయంలో ఉన్న వెసులు బాటు గుర్తుకు వచ్చిన చిన మంత్రిగారు, ఒక లాజిక్ చెప్పారు. “పోయినవారందరూ చనిపోయినవాళ్ళు కాదు. వారు కనబడకుండా పోయారంతే!” అధికారులు చెప్పిన ఆ పాయింటు వరకే మనం స్వీకరించినట్లయితే మనకిక ఏ శాస్త్రం అడ్డుతగలదని భేషయిన ఆలోచన చెప్పడంతో, పెదమంత్రిగారి కంట ఉత్తరాఖండ్ వరద నీటిలా కన్నీళ్లు పొంగుకొచ్చేసాయి. అంతే! ఒక ఉదుటన మూడు మెట్ల చొప్పున ప్లేను లోంచి దూకేసి మళ్ళీ ఓదార్పుయాత్రకి సిద్దమయిపోయారు.

 

మనవి: మంత్రిగారి ఈ ఓదార్పుయాత్రని, జగన్ మోహన్ రెడ్డి ఓదార్పుయాత్రతో ముడిపెట్టి, ‘జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి కుమ్మక్కు’ అని నీలపనిందలువేయవద్దని తెదేపా సభ్యులకు మనవి.