ప్రజాసేవలో తండ్రీ కొడుకులు

 

సినిమాలలో ఒంటి చేత్తో వందమందిని చిదగోట్టేసే రామ్ చరణ్ తేజ్, తనకు దారీయని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను పోలీసు స్టేషన్ కి ఈడ్చి వారి ఉద్యోగాలు పోగొట్టడం ఇష్టం లేక, ఏదో లైట్ గా చిన్న కోటింగు మాత్రమే ఇచ్చి వదిలేసి తన విశాల హృదయం ప్రదర్శించుకొన్నాడు. సామాన్య ప్రజల పట్ల అతనికున్న అభిమానం అటువంటిది మరి. అందుకు ప్రజలు సర్వదా అతనికి రుణపడి ఉండక తప్పదు. మళ్ళీ ఎప్పుడయినా అతను ఇంట్లోంచి బయలు దేరినప్పుడు మేకల మందల్లాంటి ప్రజలు పొరపాటున కూడా ఆయన కారుకి అడ్డం రాకూడదని, వస్తే ఏమవుతోందో అందరికీ ఇప్పుడు బాగా అర్ధమయింది కనుక మళ్ళీ తమ వల్ల అటువంటి పొరపాటు జరుగకుండా చూసుకొంటారని ఆశించవచ్చును.

 

ఇక, నిన్నమొన్నటి వరకు మన హృదయాలలో మెగా స్టార్ గా కొలువయిన చిరంజీవి, సామాజిక న్యాయ సూత్రాల ప్రకారమో, మరే సూత్రం ప్రకారమో మన రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ కేంద్ర పర్యాటక శాఖా మంత్రి అయ్యారు. ఇక ఆయన రాష్ట్రంలో పర్యాటకానికి పట్టం కడదామని పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తూ ఇప్పటికే రెండు మూడు దేశాలు కూడా తిరిగి వచ్చారు. అంటే ఆయన అంతకు ముందు విదేశాలలో తిరుగలేదని కాదు. అప్పుడు నిర్మాతల ఖర్చులతో, తిరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఖర్చులతో శ్రమ అనుకోకుండా విదేశాలు తిరిగి మన కోసం చాలా జ్ఞాన సముపార్జన చేసుకొని వచ్చారన్నమాట.

 

ఆయన ఎంతో ప్రయాస పడి, ఐక్యరాజ్యసమితి సభ్యులను అతి కష్టం మీద ఒప్పించి, హైదరాబాదు రప్పించి పార్క్ హైత్త్ హోటల్లో మూడు రోజులు పాటు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందుకు ఆయనను ప్రశంశించక పోగా, కొందరు ఉస్మానియా విద్యార్ధులు, 3 రోజుల పర్యాటక ముచ్చట్ల కోసం రూ.2.14 కోట్ల ప్రజా ధనం చిల్లర పైసల కంటే హీనంగా ఖర్చు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటి ముందు నిన్న సాయంత్రం ధర్నాచేసారు.

 

పది మంది ఐక్యరాజ్యసమితి సభ్యులకు ఒక్కో కప్పు టీకి రూ.1200ల చొప్పున రూ.2.40 లక్షలు, ఒక్కో ప్లేటు భోజనానికి రూ.3500 చొప్పున రూ.5.25 లక్షలు, వారు వై ఫి(ఇంటర్నేట్) వాడుకొన్నందుకు రూ.2.40 లక్షలు, ఫోన్ కాల్స్‌ చేసుకొన్నందుకు రూ.1.20 లక్షలు పర్యాటక శాఖా ఖర్చు చేయడం చాలా అన్యాయమంటూ, ప్రతీ చిన్నదానికీ విద్యార్ధులు లెక్కలు తీసి చెపుతూ ప్రజా ధనం వృధా చేసినందుకు వెంటనే చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేయబోయారు.

 

కానీ, వారిని పోలీసులు అరెస్ట్ చేసి, ‘పెద్దవాళ్ళని అలా నిలదీయడం తప్పునాయనలారా!’ అంటూ క్లాసు పీకి వదిలిపెట్టేసారు.

 

కానీ, ఉడుకు రక్తం ఉరకలేస్తున్న ఆ యువకులు అక్కడి నుండి నేరుగా సీబీఐ ఆఫీసుకు వెళ్లి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ చేతిలో తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ పెట్టి ఈ వ్యవహారంలో చిరంజీవి పాత్రపై ఓ లుక్కేయమంటూ పిర్యాదు చేసారు. మరి, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, మంత్రుల, ఐఏయస్ అధికారుల, బళ్ళారి బాబుల కేసులతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన, ఇక మరో నెలలో తిరిగి తన హెడ్ ఆఫీసుకి వెళ్లిపోనున్న ఈ తరుణంలో, ఇక ఈ మెగా కేసు స్వీకరిస్తారోలేదో అనుమానమే.     

 

 

అయినా మన దేశంలో ఏదయినా ఒక మంచి పని మొదలుపెట్టాలని ఎవరయినా అడుగు ముందుకు వేస్తే, వారి ఉత్సాహం మీద నీళ్ళు జల్లే ఇటువంటి వారు చాలా మందే ఉంటారు గనుక, పర్యాటక శాఖా మంత్రి గారు ఇవన్నీ పట్టించుకోకుండా మిగిలిన ఈ పది నెలల్లో మరిన్ని విదేశీ పర్యటనలు చేసి, ఇటువంటివి మరనేక సదస్సులు మరింత ఘనంగా నిర్వహించాలని కోరుకొందాము.

 

వెదవ డబ్బు కోసం ఇంత రచ్చ చేయాలా? నెలకి మరో రెండు సర్ చార్జీలు తగిలిస్తే ప్రజలే ఎంత కావాలంటే అంతా కక్కుతారు కదా!