చిరంజీవీ! డైలాగులు మరిచిపోతే ఎలాగయ్యా?

 

కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి పుట్టిన ప్రజారాజ్యం పార్టీ చివారఖరికి ఆ బంగాళఖాతంలోనే కలిసిపోగా, ఆయన ప్రజారాజ్యం నావ ఎక్కినవారు మునిగి పోయిన వారు మునిగిపోగా, మిగిలినవారు అదే కాంగ్రెస్ పార్టీలో తేలారు. అందుకు బహుమానంగా ఆయన కేంద్ర మంత్రి పదవి స్వీకరించి, తనతో మిగిలినవారిలో కొందరికి యధాశక్తిన ఏవో చిన్నాపెద్దా పదవులు ఇప్పించుకొన్నారు.

 

ప్రజారాజ్యం ఊపుమీద ఉన్న తోలిరోజుల్లో చిరంజీవి ‘సామాజిక తెలంగాణ’ అనే తనకే అర్ధం కాని ఒక కొత్తరాగం అందుకొని, అందరినీ గందర గోళం లో పడేసి చివరికి తనకీ అర్ధం కాకపోవడంతో, అనువయిన కాంగ్రెస్ పల్లవి ఎత్తుకొన్నాడు.

 

అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ బాష బాగా నేర్చుకొన్నందున, ఆయనని ఎవరయినా “తెలంగాణా సంగతి ఏమిటీ? మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగినప్పుడు ఈ అంశంపై తానూ ఎన్నోసార్లు తన అభిప్రాయం ప్రకటించానని అందువల్ల మళ్ళీ మళ్ళీ అడిగి చరిత్ర తవ్వోదని సూచిస్తుంటారు. ప్రస్తుతం తానూ పూర్తీ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తను గనుక తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే తనకు శిరోధార్యం అన్నాడాయన. ఏది ఏమైనా వీలయినంత త్వరలో నిర్ణయం జరగాలని ఆయన కోరుకొన్నారు.

 

మన కోదండరామాచార్యుల వారు, ఎంతయినా ప్రొఫెసరుగా చేసారు గనుక చిరంజీవికి అర్ధం అయ్యే సినిమా బాషలోనే జవాబిచ్చే ప్రయత్నం చేసారు. నటుడు కెమెరా ముందుకొచ్చి తన డైలాగులు మరిచిపోతే ఎలా ఉంటుందో, లేక వేరొకరి డైలాగులు వల్లిస్తే ఎలాఉంటుందో ఇప్పుడు చిరంజీవి మాటలు కూడా అలానే ఉన్నాయని ఆన్నారు. సామాజిక తెలంగాణా అంటూ ఆవేశపడిపోయి, ఇప్పుడు ఏకంగా తెలంగాణాయే వద్దని మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని అయన అన్నారు.