సమైక్యమే అంటున్న మెగా స్టారువారు

 

ఇపుడిపుడే కాంగ్రెస్ నీరు ఒంటబట్టిన్చుకొంటున్న మన మంత్రి చిరంజీవిగారు, తమ పార్టీలో అందరు నేతలు కూడా అఖిలపక్షం, తదనంతర పరిణామాల గురించి మాట్లాడేస్తూ నిత్యo మీడియాలో కనబడుతుండగా తానూ మాత్రం మడికట్టుకొని మూలాన కుర్చోవడం ఎందుకనుకున్నాడో మరేమో, నిన్న నల్గొండలో జరిగిన ఒక సభలో తనకు తోచిన అభిప్రాయం తను కూడా వ్యక్తం చేసాడు. అంతే గాకుండా, తన ప్రసంగంలో కాంగ్రెస్ సంప్రదాయ వాడుక పదాలయిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అధిష్టానం, విధేయత, క్రమశిక్షణ, కార్యకర్త వంటివన్నికూడా మద్య మద్యలో జోడించి ప్రసంగించి తనకీ రాజకీయ పరిణతి, కాంగ్రెస్ సంస్కృతి రెండూ అబ్బేయని కూడా ఋజువు చేసుకొన్నాడు.

 

ఇంతకీ ఆయనేమన్నాడంటే, “నేను మొదటి నుండే చెపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్న నిలిచే పార్టీ అని. మా అదిష్టానం రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఏమి కోరుకొంటున్నారో దానినే అమలు చేయబోతోంది. ఇటీవల మా అధ్యక్షురాలు సోనియాగాంధీగారిని కలిసినప్పుడు ఆమెకి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి త్వరగా సమస్యని పరిష్కరించామని కోరాను. త్వరలో ఆమె “మెజార్టీ ప్రజలకి ఆమోదమయిన నిర్ణయం” ప్రకటించుతారు. ఆమె నిర్ణయం ఏదయినా సరే విదేయత, క్రమశిక్షణ గల కార్యకర్తలగా మేమందరమూ అంగీకరిస్తాము.”

 

చిరంజీవి తన రాజకీయ పరిణతిని చూపించడంతో బాటు, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఆలోచనలకి అద్దం పట్టెడు తన ప్రసంగంలో. మెజారిటీ ప్రజల అభిప్రాయం అంటే సమైక్యంద్ర రాష్ట్రం అని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. అంటే, తెలంగాణా కోసం కేంద్రం ఒక అభివృద్ధి మండలినో మరో ఆలోచనో చేస్తున్నట్లు సంకేతం ఇచ్చినట్లే భావించవలసి ఉంటుంది. సీమంద్రకు చెందిన లగడపాటి, గాదె వెంకట రెడ్డి వంటి వారు రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని బల్లగుద్ది మరీ చెపుతున్న ఈతరుణంలో చిరంజీవి మాటలు వారి వాదనకి బలం చేకూర్చేవిగా ఉన్నాయి.

 

ఒకవేళ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు తలఎత్తక మానవు. అదే జరిగితే, ఇప్పటికే, అన్నివిధాల వెనకబడిపోయిన మన రాష్ట్రం మరింత వెంకబడిపోక తప్పదు. తద్వారా, రాష్ట్ర ప్రజల పరిస్థితులు మరింత దిగజారిపోక తప్పవు.