ఏపీలో దేవుడి ఆస్తులకు రక్షణ ఏది?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దుండగులు దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ద్వసం చేయడం సహా ఇతరత్రా ఆలయాలను పవిత్రతను పాడుచేసే చర్యలు యద్దేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 12,13 తేదీలలో నెల్లూరు జిల్లా బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో  రథాన్ని దుండగులు తగుల బెట్టారు.అంతకు ముందు కూడా పనిగట్టుకుని దేవాలయాలప పవిత్రతను చెరచే చర్యలు అనేక జరిగిన బిట్రగుంట సంఘటన తర్వాత దాడుల వెనుక దాగున్న కుట్ర మెల్ల మెల్ల మెల్లగా వెలుగులోకి రావడం ప్రారంభమైంది.అయినా  దాడులు ఆగలేదు సరికదా మరింత పెరిగాయి. 

గత సంవత్సరం మే22 న జగన్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తయ్యే నాటికే ఆయన పాలనలో దేవాలయాలపై దాడుల సంఖ్య శతకాన్ని దాటింది. అదే క్రమంలో అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం తగల బడింది. గత డిసెంబర్ 29 రామతీర్థంలో రాములోరి విగ్రహం తలను దుండగులు తీసేశారు.ఈ సంఘటన తర్వాత రాజకీయ వేడి రాజుకుంది.ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదటి సారిగా ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంపై స్పందించారు. ప్రభుత్వాన్ని నిందించారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు.. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగానే రాష్ట్రంలో హిందూ దేవాలయలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

బీజేపీ ఇతర హిందూ ధార్మిక సంస్థలుకూడా తీవ్రంగా స్పందించాయి.ఈనేపధ్యంలో జనవరి 17 న కర్నూల్ జిల్లా మంత్రాలయం నుంచి దేవాలయాల సందర్శన యాత్ర చేపట్టిన  త్రిదండి చినజీయర్ స్వామి రాయలసీమ జిల్లాల యాత్రను ముగించుకుని గురువారం తిరుమల శ్రీవేకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చినజీయర్ స్వామి.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలు , దేవాలయాల ఆస్తులు దాడులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నాటికీ అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. దేవుని ఆస్తులను రక్షించవలసిన ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించక పోవడం వలన ఇప్పటికే చాలావరకు దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయని చిన జీయర్ స్వామి అన్నారు. పర్యవేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 

ఆలయాల యాత్రకు సంబందించి, రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించానని...ఈ ఆలయాలలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో ఓ విఙ్ఞాపన పత్రాని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి అందజేసినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. రాష్ట్రంలో చాలా ఆలయాలు అభివృద్దికి నోచుకోలేదని, ప్రభుత్వం వెంటనే వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. ఆలయాలు బాగున్నప్పుడే ప్రజలలో నైతిక ప్రవృత్తి బాగుపడుతుందని  చిన్నజీయ్యర్ స్వామి చెప్పారు. అయితే అయిన వాళ్ళకు ఆకుల్లో కానీ వాళ్ళకు కంచాల్లో అన్నట్లుగాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యమతాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, హిందువుల పట్లవివక్ష చుపుతున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.