రేవంత్ రెడ్డికి మొండి హస్తం.. చిన్నారెడ్డికే టీపీసీసీ పగ్గాలు!!

కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పీసీసీకి నూతన సారథిని నియమించింది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ అంశం మళ్లీ తెరపై కి వచ్చింది. తెలంగాణలోని పలు సమీకరణాల నేపథ్యంలో పార్టీ విధేయతకు ప్రాధాన్యమివ్వాలా లేక ప్రజాకర్షణకు పెద్ద పీట వేయాలన్న దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్య దర్శి సంపత్ కుమార్, తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఏపిసిసి అధ్యక్ష పదవి కోసం గిడుగు రుద్రరాజు ,పల్లం రాజు తోపాటు పలువురి పేర్లు చర్చకు వచ్చినా అధిష్ఠానవర్గం తమ సొంత నిర్ణయం మేరకు శైలజానాథ్ ను నియమించిందని.. అదే దృక్పథంలో టిపిసిసి అధ్యక్షుడు కూడా నియమిస్తారని.. రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

కాగా వరుస ఎన్నికల్లో డీలా పడిన పార్టీకీ నూతన నాయకత్వం ఉత్తేజాన్నిచ్చేదిగా ఉండాలన్న అంశంపైన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి ఫిరాయించిన నేపథ్యంలో పార్టీ పట్ల విశ్వాసం పై అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి నూతన సారథిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తే రేవంత్ రెడ్డి , చిన్నారెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని చెబుతున్నారు. విశ్వాసానికి ఓటు వేస్తే చిన్నారెడ్డికి అవకాశం దక్కవచ్చని పార్టీకి నూతనోత్తేజం అందించాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డికే పట్టం కట్టవచ్చని అంటున్నారు. రెడ్డి ఇతర వ్యక్తికి ఇవ్వాలని భావిస్తే శ్రీధర్ బాబు పేరే ఖరారవుతుందని అనుకుంటున్నారు. ఇటు పార్టీ పట్ల విశ్వాసం వివాదరహితుడు కావడం ఆయనకు కలిసి వస్తుందంటున్నారు మునిసిపల్ ఎన్నికలు పూర్తి కాగానే నూతన సారథిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు.