ఏపీలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు

 

భాజపా పై తిరుగుబాటు చేసేందుకు సిద్దమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేసి కూటమిని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సైతం సమావేశమై మంతనాలు జరిపారు.అయితే దీన్ని కొందరు నేతలు వక్రీకరించి విమర్శలు చేస్తున్నారు.ఈ విమర్శలపై ఏపీ మంత్రి చినరాజప్ప స్పందించారు.దేశభవిష్యత్తు కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ చేశారని చినరాజప్ప స్పష్టం చేశారు.భాజపాకు తగిన బుద్ధిచెప్పడానికే 16 ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయన్నారు. పీవీ హయాంలో దేశ సంక్షేమం కోసమే తెదేపా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్‌ కూడా పీవీ నరసింహారావుకు మద్దతు పలికారన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ విషయమై చంద్రబాబు తుదినిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ ముందుకొచ్చిందన్నారు. ప్రత్యేక హోదాతోపాటు ఏదికావాలన్నా ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే కాంగ్రెస్‌తో కలిసినట్లు తెలిపారు. తాము పార్టీని కలపడంలేదని.. కేవలం పొత్తు పెట్టుకొంటున్నామని తెలియజేశారు.