తెలంగాణ మొదటి ముఖ్యమంత్రులము మేమే

 

కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందో లేదో తెలీదు గానీ, అటు కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎవరు ముఖ్యమంత్రి కావాలని టీ-కాంగ్రెస్ నేతలు ముసుగులో గుద్దులాట మొదలయిపోయింది.

 

ఖాళీగా పడున్న హోంమంత్రి మంత్రి సీటులో కూర్చొని ముచ్చట తీర్చుకోవాలనుకొంటే అడ్డుపడిన ఈ కిరణ్ కుమార్ కి బుద్ది చెప్పాలంటే, ఒక మంచి రోడ్డు మ్యాపు గీసుకొని ఏకంగా ముఖ్యమంత్రియి పోవడమే బెటరు అనుకొంటూ దామోదర చేతిలో ఉన్న రంగు పెన్సిళ్ళతో గడ్డం గోక్కొంటూ మ్యాపులు గీసుకొంటున్నాడు.

 

రేపు రాష్ట్రం ఏర్పడితే అప్పుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయమన్నపుడు టైము ఉంటుందోలేదోనని ముందుగానే సూటు కూడా కుట్టించుకొని వేసుకు తిరుగుతున్నాను.అసలు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా ఉద్యమాన్నిబ్రేకులు వేస్తూ ముందుకు, వెనుకకి, పక్కకి అన్ని డైరెక్షన్లలో తీసుకువెళ్తున్న వాడిని నేనే. అయినా ఎవరికీ నేను కనబడటం లేదు. ఇక నా ప్రయత్నాలేవో నేను చేసుకోక తప్పేలా లేదనుకొంటూ జానారెడ్డి మీడియా వాళ్ళని పిలిచి “ముఖ్యమంత్రి పదవి కంటే తెలంగాణాయే నాకు ముఖ్యం’ అని ఒక స్టేట్మెంటు ఇచ్చేరు. అప్పుడు మీడియా వాళ్ళ ‘అయితే మీకు ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదా?’ అని అడిగితే, ‘ముందు తెలంగాణా రానీయండి’ అని తన మనసులో మాట చెప్పేశారు.

 

‘హోంమంత్రి పదవి ఇస్తారంటే ఆశపడి ఇన్ని రోజులు తెలంగాణా గురించి మాట్లాడకుండా ఆ ఆంధ్రా ముఖ్యమంత్రి నించోమంటే నించొన్నాము, కూర్చోమంటే కూర్చోన్నాము. కానీ మాయమాటలు చెపుతూ చివరికి అది కూడా తన దగ్గిరే అట్టేపెట్టేసుకొన్నాడు. మా రాష్ట్రం మాకొస్తే అప్పుడు నేను ముఖ్యమంత్రినయినప్పుడు గానీ అతనికి నా గొప్పదనం తెలిసిరాదు, అని బాబ్డ్ హెయిర్ సవరించుకొంటూ గీతా రెడ్డమ్మ చరచరా వెళ్లిపోతుంటే, ఆమెని చూసి మూతులు తిప్పుకొన్నారు మిగిలిన రెడ్డమ్మలు.

 

ముఖ్యమంత్రి పదవికి ప్రధాన అర్హతలయిన ‘దళిత కోటా’, ‘మహిళా కోటా’ ‘ఉద్యమ కోటా’ లేదా ఈ మూడింటి కాంబినేషనులో ‘దళిత మహిళా ఉద్యమ నేత’లుగా ఏవిధంగా చూసుకొన్నా కూడా అన్ని విధాల అర్హతలున్న తమకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తామేమి (మట్టి) గాజులు తొడుకొని కూర్చోబోమని, (మొన్నబంగారం ధర తగ్గినప్పుడు కొనుకొన్న) కొత్త బంగారు గాజులను సవరించుకొంటూ రుసరుసలాడుతున్నారు మిగిలిన రెడ్డమ్మలు.

 

ఆంద్రోళ్ళ ఇస్టోరీ తరువాయి భాగంలో....