కుర్చీ పోయే..పరువు పోయే...

 

అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే.. ముఖ్యమంత్రి పదవి ఆశలు ఆవిరాయెనే .. ఇదీ సీమాంధ్ర సీనియర్ కాంగ్రెస్ వీరవిధేయుల తాజా సాంగ్. ఎప్పుడెప్పుడు నల్లారి వారు దారి ఇస్తారా... అని ఎదురు చూస్తూ ఆయన కుర్చీ చుట్టూ తిరుగుతున్న గ్యాంగ్ .. విభజన ప్రక్రియ చివరి దశలో ఉన్నపుడే డిల్లీలో మకాం వేషి లాబీయింగ్ మొదలు పెట్టేసారు. తెలంగాణా బిల్లుకు మద్దతు కూడగట్టే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సీమాంధ్రకు న్యాయం, బిల్లులో సవరణలు చేయిస్తామంటూ మరో బృందం టెన్ జనపథ్ అమ్మ కరుణా కటాక్ష వీక్షణాల కోసం నిరీక్షించారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు స్థాయికి మించి బీజేపీ. టీడీపీ నేతలను తిట్టిపోసేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని ఆరోపణలు గుప్పించారు. అటు బిల్లు ఆమోదం పొందడం.. ఇటు కిరణ్ రాజీనామా చేయడంతో ఆశావహుల జాబితా పెరిగిపోయింది. కనీసం ఐదు రోజులైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొంటే చాలు... అదే ఐదేళ్లని తృప్తిపడి సర్దుకుపోతామని అంటూ కనిపించిన కాంగ్రెస్ పెద్దలందరినీ వేడుకున్నారు. పన్లో పనిగా ‘అధిష్టానం ఆదేశిస్తే ఏ ముఖ్యభాద్యతలు స్వీకరించడానికయినా సిద్ధం’ అంటూ ఎవరినో ఉద్దరించడానికి త్యాగం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ప్రకటించేశారు.

 

హైకమాండ్ కు మరో బిస్కెట్ కూడా వేశారు. ఎన్నికలు 6 నెలలు పొడిగించి ..తమకు పార్టీ, ప్రభుత్వ భాద్యతలు అప్పగిస్తే అంటా ‘సెట్ రైట్’ చేసేస్తామని నమ్మబలికారు. అదీ వీలుపడేలా కన్పించక పోవడంతో సీఎం ఎవరైనా ఫర్వాలేదు, ప్రభుత్వం ఏర్పాటయితే అదే మాకు పదివేలు... అంటూ ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ కలిసి బృందగానం కూడా చేశారు. అంతా అనుకున్నట్టే జరిగింది. హైకమాండ్ తమలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తుంది అని.. సూట్ కేసంత ఆశతో అందరూ అమ్మగారి గుమ్మం వద్ద అంత చలిలోనూ గజగజా వణుకుతూ పడిగాపులు కాశారు. కానీ అమ్మగారి ఆంతరంగికులు ఆమె చెవిలో ఏదో ఊదేసారికి అమ్మగారి ఆలోచనలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. దానితో సీను పూర్తిగా మారిపోయింది.

 

రాష్ట్ర విభజనకు ముందే ప్రాంతాలవారీగా నేతలు విడిపోయికొట్టుకొన్న ఈ నేతల మాటల నమ్మి వారిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఆ తరువాత ఆంధ్ర, తెలంగాణా అంటూ కీచులాడుకొంటే ఉన్న పరువు కూడా గంగలో కలిసిపోతుందని, పైగా ఎవరికి పగ్గాలు అప్పగించినా ప్రతిపక్షాలు అందులో ‘లా పాయింటు’ తీసి రెండో ప్రాంతం వారికి అన్యాయం జరిగిపోయిందని ఎన్నికల ముందు కాకి గోల చేస్తే ఇక తమ పార్టీకి ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావని అంతరంగికులు అమ్మగారికి నూరిపోసారుట! ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్ కి మూడిపోయింది. మూడు రోజుల ముచ్చట కోసం మళ్ళీ ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే...ఇక తెలంగాణాలో కూడా మూటాముల్లె సర్దుకోవాల్సి వస్తుందని భయపెట్టేసారుట! వీళ్ళని వేరే పార్టీలో ఎలాగూ చేర్చుకోరని తెలిసినందునే మన కాళ్ళవద్ద పడిఉన్నారని లేకుంటే వీళ్ళు కూడా మిగిలిన వాళ్ళలాగే ఎప్పుడో వేరే పార్టీలోకి జంపయిపోయేవారని అమ్మ చెవిలో ఎవరో ఊదేరుట. రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని ఒకపక్క ‘సర్వేస్వర్లు’ ఘోషిస్తుంటే, పార్టీని బలోపేతం చేసేసి సీమాంధ్రలో విజయడంకా మ్రోగించేస్తామని చెపుతున్న వారి మాటలు నమ్మి కాలిన చేతులను ఇంకా కాల్చుకోవద్దని శ్రేయోభిలాషులు హెచ్చరించారుట! ఆంధ్రా వాళ్ళకంటే అంతరంగికులను నమ్ముకోవడమే బెటర్ అని భావించిన హైకమాండ్ వారు రాష్ట్రపతి పాలనే అన్ని విధాల సేఫ్ అని దానికే కమిట్ అయిపోయారుట!

 

అమ్మగారు చెప్పుడు మాటలు విని తమను నమ్మకుండా రాష్ట్రపతి పాలన విదించేసారని కుమిలిపోతూ ఆంధ్ర, తెలంగాణా నేతలందరూ ఒకరినొకరు ఓదార్చుకొంటూ హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. అటు అధిష్టానం అనుమానపు చూపులు.. ఇటు ప్రజల నుండి ఛ్చీదరింపులతో తమ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయిందని వాపోతున్నారు. పదవీ పోయే...పరువూ పోయే... పైసలూ ఖర్చై పాయె....అని లబో దిబోమంటున్నారట!