ఎట్టకేలకు మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం

 

రోమ్ నగరం తగల బడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని ఇక మనం రిఫరెన్స్ కోసం వాడుకోనవసరం లేదు. అతనికి ఏమాత్రం తీసిపోని కిరణ్ కుమార్ రెడ్డి మనకి ఉన్నారిప్పుడు. ఉత్తరాఖండ్ వరదలలో తెలుగు ప్రాణులు చిక్కుకొని విలవిలలాడుతుంటే, నా బంగారు తల్లి, నా ఇందిరమ్మ కలలు, నా యస్సీ ఎస్టీ బిల్లు అంటూ రానున్న ఎన్నికలకి వోటు బ్యాంకుకి ఎరలు సిద్దం చేసుకొంటూ తాపీగా కూర్చొన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమెరికా నుండి వస్తూనే హుటాహుటిన డిల్లీలో నిలబడి సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టి, విమానంలో ప్రయాణికులను తరలించడం మొదలుపెట్టాక గానీ, ఆ పనులన్నీ ప్రభుత్వం చేయాలని గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రిగారికి. ఇక, విప్పత్తుల నిర్వహణ చూసుకొంటున్న మంత్రి రఘువీరా రెడ్డి గారికయితే, వరదలు వచ్చిన నాలుగయిదు రోజులవరకు ఆ విషయమే పట్టలేదు.

 

మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా మేల్కొని ఒక బృందం వైద్యులను డిల్లీకి, మరొక బృందాన్ని డెహరాడూన్ కి, మరొకటి హరిద్వార్ కి పంపించింది. కానీ, అప్పటికే సగం మంది బాధితులను తెదేపా వారి వారి నగరాలకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తరలించేయడంతో, వైద్య బృందాలు ఇంకా మిగిలిన తెలుగు వారికి, అక్కడికి చేరుతున్న ఇతర రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. ఇంత జరిగాక ఇంకా అపఖ్యాతి మూట కట్టుకోవడం ఎందుకనుకోన్నారో ఏమో, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానాన్ని, హరిద్వార్ నుండి ఒక ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేసింది.

 

విపత్తు సంభవించగానే స్పందించాల్సిన ప్రభుత్వం అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని ఇప్పుడు వారం రోజుల తరువాత హెల్ప్ లైన్లు, వైద్య బృందాలు, ఆంధ్ర భవన్లో భోజన, వసతి సౌకర్యాలు, ప్రత్యేక రైళ్ళు, విమానాలు అంటూ హడావుడి మొదలుపెట్టింది. ఇదేపని మొదటి రోజునుండే మొదలుపెట్టి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ, నలుగురితో చెప్పించుకొన్నాక, ప్రతిపక్షాలు విమర్శలు చేసిన తరువాత గానీ రాష్ట్ర ప్రభుత్వానికి తన కర్తవ్యం ఏమిటో భోధపడలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక ‘మేల్కొలుపు శాఖ’ను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకొంటే మేలేమో. కానీ, దానిని మేల్కొల్పడానికి మరొకరు ఉండాలేమో!