తిరుపతి, సాగర్ బైపోల్ షెడ్యూల్!  

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ తో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు సెప్టెంబర్ 16న చనిపోయారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ డిసెంబర్ 1న మరణించారు. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. శుక్రవారం  మధ్యాహ్నం 4.30 గంటలకు మీడియా సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.   

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల కమిషన్  ప్రకటించనుంది. పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.  ఏప్రిల్-మేలో ఈ ఐదు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గత బుధవారంనాడు ఈసీ సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది సీఈసీ. 

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విశ్వాస పరీక్షకు ముందు ముఖ్యమంత్రి నారాయణ స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రాజీనామా చేయడంతో పాండిచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు.