మోడీకి తెలియదేమో చిదంబరం చెప్పేశారు

 

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోడీ..కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కాకుండా వేరొకరికి 5 ఏళ్ళు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టగలదా అని ఆరోపించారు. మోడీ చేసిన ఆరోపణకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం స్పందించారు. గాంధీ కుటుంబంలోని వారు కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన వారి జాబితాను ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అంతే కాకుండా ప్రధాని మోడీ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారనే విషయంపై అంత సమయం వెచ్చించి మాట్లాడం తమకు గొప్పగా ఉందని చిదంబరం పేర్కొన్నారు. అందులో సగం సమయం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రఫేల్‌, సీబీఐ, ఆర్‌బీఐల గురించి మాట్లాడడానికి కేటాయిస్తారా అని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగిత, మూకదాడులు, అత్యాచారాలు, ఉగ్రదాడులు తదితర అంశాలపై మోడీ మాట్లాడుతారా అని చిదంబరం సవాలు చేశారు.

చిదంబరం ట్విట్టర్ లో.. "1947 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా చాలా మంది బయటి వ్యక్తులు పనిచేశారని పేర్కొన్నారు. ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్‌ టాండన్‌, యూఎన్‌ ధేబర్‌‌, నీలం సంజీవ రెడ్డి, కామరాజ్‌, నిజలింగప్ప, జగజ్జీవన్‌ రామ్, శంకర్‌ దయాళ్‌ శర్మ, దేవకాంత బరూవా, బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, సీతారాం కేసరిల పేర్లను ట్వీట్‌ చేశారు. ‌అంతేకాకుండా స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఎంతో మంది గొప్ప నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారని, అందుకు తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. బాబాసాహెబ్‌‌ అంబేడ్కర్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, కె. కామరాజ్‌, మన్మోహన్‌ సింగ్‌ ఇలా ఎంతో మంది నేతలు దేశం కోసం కృషి చేశారని తెలిపారు".