చిదంబర మాయతో ఓట్లు రాలుతాయా?

 

ఆర్ధికమంత్రి చిదంబరం నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ గమనిస్తే, అది పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినదేనని అర్ధమవుతుంది. మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టగలిగితే చాలు ఎన్నికలలో ఓట్లు గలగలా రాలిపోతాయనే భ్రమలో నుండి కాంగ్రెస్ పార్టీ బహుశః ఎన్నటికీ బయటపడలేదేమోనని ఈ బడ్జెట్ చూస్తే అర్ధమవుతుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలుచేసే సెల్ ఫోన్లు, ఫ్రిజ్జులు, స్కూటర్లు, మోటార్ సైకిల్సు, కంప్యూటర్లు , ప్రింటర్లు, చిన్న కార్లపై సుంకాలు తగ్గించడం ద్వారా చిదంబరం వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు. ఇక గంపగుత్తగా లక్షలాది మంది సైనికులను, వారి వెనుక ఉండే వారి కుటుంబాల ఓట్లను రాల్చుకొనే ప్రయత్నంలో ఒకే ర్యాంక్-ఒకే పెన్షన్ పధకానికి కూడా లాంచనంగా ఆమోదముద్ర వేసారు. ఎన్నికలే కనుక లేనట్లయితే ఈ బడ్జెట్లో ప్రజల గోళ్ళూడగొట్టి మరీ బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. కానీ, ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని అటువంటి సాహసం చేయడంమెందుకని ఈసారికి ప్రజలను కనికరించారు. అందువల్ల ఈ బడ్జెట్లో కొత్తగా పన్నులు లేవు. ఉన్న పన్నులు పెరుగలేదు. అదేవిధంగా వేటి ధరలు కూడా పెంచే ప్రయత్నం చేయలేదు.

 

దేశంలో ప్రజలందరూ అల్ప సంతోషులు, ‘మెమొరీ లాస్’ వ్యాధితో బాధపడుతున్నారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ తాయిలాలతో వారందరూ సంబరపడిపోతూ గత పదేళ్ళలో తను వెలగబెట్టిన నిర్వాకాలన్నిటినీ కూడా మరిచిపోయి, గుడ్డిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసేస్తారని కాంగ్రెస్ అధిష్టానం దృడంగా విశ్వసిస్తోంది. అందుకే ఎన్నికల ముందు తాయిలాలు పంచిపెడుతోంది. ఇది ఆ పార్టీకి ప్రజల విజ్ఞత పట్ల ఎంతటి చులకన భావం ఉందో అద్దం పడుతోంది. ఇంతవరకు వెలువడిన సర్వే నివేదికలన్నీ కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పదే పదే హెచ్చరిస్తున్నా కూడా మేల్కొనకపోగా తను భ్రమలో ఉంటూ ప్రజలను కూడా భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కధ క్లైమాక్సుకు చేరుకొన్న తరువాత దానికి ఇంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.