అవినీతిని లైట్ తీసుకోమంటున్న మంత్రిగారు

 

సీబీఐని పంజరంలో ఉన్న చిలుకగా అభివర్ణించిన సుప్రీంకోర్టు, ఆ ఒక్క చిలుకకు అనేక మంది యజమానులని ప్రభుత్వ పెద్దలను విమర్శించింది. సీబీఐపై ప్రభుత్వ ప్రమేయం, అజమాయిషీ, ఒత్తిళ్ళు లేకుండా పనిచేసేందుకు చట్టంలో అవసరమయిన మార్పులు వెంటనే చేయమని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో, అందుకు తగిన సూచనలు, సలహాలతో ఒక నివేదికను తయారు చేసేందుకు ఆర్ధిక మంత్రి చిదంబరం నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో కూడిన ఒక కమిటీ ఏర్పడింది. అయితే, కమిటీకి నేతృత్వం వహిస్తున్న చిదంబరం గారు, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నపటికీ, అక్కడి నుండే తన అమూల్యమయిన సలహా ఒకటి తెలియజేసారు.

 

సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా దర్యాప్తు విషయంలో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, కానీ అదే సమయంలో సీబీఐ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అంటే, చిలుక ఎగురవచ్చును కానీ మళ్ళీ పిలవగానే వచ్చి గూటికి చేరిపోవాలన్నమాట. ప్రపంచంలో సీబీఐ వంటి వివిధ వ్యవస్థలు తప్పనిసరిగా అక్కడి కార్యనిర్వాహక వ్యవస్థకు (ప్రభుత్వానికి) లేదా శాసనవ్యవస్థకు లేదా కోర్టులకు జవాబుదారీగా ఉంటాయి. అదేవిధంగా మన దేశంలో కూడా సీబీఐ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండవలసి ఉంటుందని ఆయన అన్నారు.

 

అదే సమయంలో సీబీఐ దర్యాప్తుల్లో ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఇతర వ్యక్తులు జోక్యం కల్గించుకోకుండా ఆ వ్యవస్థను ఏవిధంగా కట్టు దిట్టం చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న సమస్య అని ఆయన అన్నారు.

 

మనం అవినీతి గురించి మరీ అంత బెంగ పెట్టేసుకొనవసరం లేదని చిదంబరం గారు శలవిచ్చారు. ఎందుకంటే అవినీతి ఒక్క భారత దేశానికే పరిమితమైన అంశం కాదని, ప్రపంచంలో ప్రతి దేశంలో ఈ అవినీతి ఆరోపణలనేవి ఉన్నాయని అందువలన అవినీతిని లైట్ తీసుకోమని సూచించారు. మరి సీబీఐ గురించి, వ్యవస్థలో అవినీతి గురించి ఇంత గొప్ప అభిప్రాయాలున్న చిదంబరంగారు నేతృత్వంలో కమిటీ ఎటువంటి నివేదిక తయారు చేస్తుందో చూడాల్సిందే.