చికెన్‌కు ఇప్పుడు మ‌ళ్ళీ డిమాండ్!

చికెన్‌, ఎగ్స్ బాగా తినండి. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోండి! మేమంతా చికెన్ తింటున్నాం. మీరు కూడా చికెన్ తినండంటూ ఎమ్మెల్యే రోజా త‌న ఇంటి కిచెన్‌లో హ‌డావిడి చేశారు. చికెన్ లెగ్ రోస్ట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఇంట్లోనే వున్న ఆమె చికెన్ వండి కుటుంబ‌స‌భ్యుల‌కు తినిపించారు.

చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనేది తప్పుడు ప్రచారమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా చెప్పారు. దీంతో చికెన్ షాపుల వ‌ద్ద సోమ‌వారం నాడు కూడా కొంత సంద‌డి క‌నిపించింది. ఎలాగూ క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్నారుక‌దా అనుకున్నారేమో చికెన్‌షాపు నిర్వాహ‌కులు కిలో 300 రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. వారం రోజుల క్రితం ఫ్రీగా ఇస్తే తీసుకోలేదు. ఈ రోజు 300 రూపాయ‌లు పెట్టి కిలో చికెన్ కొన్నాను. అంతా క‌రోనా ఎఫెక్ట్‌. ఏం చేస్తాం అంటున్నారు జ‌నం.

గ‌త నెల రోజుల నుంచి అమాంతం తగ్గుతూ వస్తున్న చికెన్ ధ‌ర‌ ఇప్పుడు ఒక్క‌సారిగా కిలో 300 రూపాయ‌ల‌కు పెరిగింది. సరిగ్గా నెల రోజుల క్రితం కిలో చికెన్ 2 వందల రూపాయలు ఉండేది. మొన్న‌టి శ‌నివారం వ‌ర‌కు ఉచితంగా ఇచ్చినా చికెన్ తీసుకువెళ్ళ‌డానికి, తిన‌డానికి జ‌నం భ‌య‌ప‌డిపోయారు.చికెన్ తింటే కరోనా వస్తుందనే భయమే జనాన్ని వెంటాడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు గ‌త కొంత కాలంగా నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా చికెన్‌కు డిమాండ్ అమాంతం పడిపోయి ఇప్పుడు చికెన్ ధ‌ర చుక్క‌ల్ని చూపిస్తోంది.