వివాదాల మనిషి.. గురువుకే పంగనామాలు పెడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి!!

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడిగా చిత్తూరు జిల్లాలో అరంగేట్రం చేసారు చెవిరెడ్డి భాస్కర రెడ్డి. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. జిల్లాలో సీనియర్లను తన గురువు భుమానను పక్కన పెట్టి వారిపై పెత్తనం చేలాయించేలా పావులు కదుపుతున్నారు. పార్టీలో వచ్చిన అవకాశాలను అందిపుచుకుంటూ గురువు కరుణాకరరెడ్డికే పంగనామాలు పెడుతూ పక్కలో బలెంలా తయారయ్యారు.భూమన కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ టీటీడీ పాలకమండలి లో ఈ ఎక్స్ అఫీషియో సభ్యుడి పదవులు కొట్టేసారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. కరుణాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుకు కూడా నెమ్మదిగా ఎసరు పెడుతునట్లు సమాచారం. అన్నీ కలిసొస్తే చంద్రగిరిలో తన కుమారుడిని రంగంలో దింపి తిరుపతిలో తాను కాళ్లు మోపాలనే ఆలోచనలో ఉన్నారట చెవి రెడ్డి. ఇప్పటి వరకు అన్ని అనుకున్నట్లు జరుగుతుండటంతో ఇదే టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. 

జిల్లా పై పట్టు సాధించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మంత్రి పెద్దిరెడ్డి సీనియర్ కావడంతో అక్కడ ఆయన మాటే ప్రస్తుతం వేదంలా నడుస్తోంది. పెద్ది రెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి ఎంపీగా సీఎం జగన్ కు ఆత్మీయుడు కావడం మంత్రికి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పటి వరకు జిల్లాలో పని కావాలంటే పెద్దాయన ఆశీస్సులుంటే చాలు అనే భావన ఉండేది. కానీ చెవిరెడ్డి మాత్రం నాకేమిటీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన పరిధిలో ఉన్న పనులకు కూడా పెద్దాయన రికమండేషన్ ఉన్నా.. నేను చెప్పాలని అడ్డుపడుతున్నారు. ఇదే కాదు టీటీడీ పాలక మండలి సమావేశంలో కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారు చెవి రెడ్డి. తనకు సంబంధంలేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కరుణాకర్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పాలనలో వేలు పెట్టడం.. వారి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన పదవులను అడ్డం పెట్టుకుని తిరుమల దర్శనాలలో పెత్తనం చేస్తున్నారు చెవి రెడ్డి. ఎమ్మెల్యే విప్, తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ వంటి నాలుగు పదవులు ఉండడంతో ఆ నాలుగు పదవుల కోటా కింద ప్రతి రోజూ 40 కి తగ్గకుండా బ్రేక్ దర్శనాలు ఇప్పించుకుంటున్నారు. ఒక్కోసారి చెవి రెడ్డి తీసుకునే బ్రేక్ దర్శనం టికెట్ల సంఖ్య 60 నుంచి 70 కూడా దాటుతుందని అధికారులు అంటున్నారు. 

సహజంగా ఒక్కో ఎమ్మెల్యేకి రోజుకు ఆరు టికెట్లు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఆ కోటాకి మించి నాలుగు ఐదు టికెట్లు అదనంగా ఇస్తారు. కానీ చెవి రెడ్డి తానకు ఉన్న ప్రతి పదవికి ఆ కోటా కింద వచ్చే అన్ని టికెట్లతో పాటు అధనంగా కూడా లాగిస్తున్నారు. తన ప్రాపకం కోసం తనకు ముఖ్యమని అనుకున్న వాళ్ల కోసం టీటీడీ నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నారే గుసుగుసలు వినిపిస్తున్నాయి. పేరుకి పరమ భక్తుడిలా కనిపించే చెవి రెడ్డి తాను అనుకున్న బ్రేక్ టికెట్లు ఇవ్వకపోతే టీటీడీ అధికారులను వేధిస్తున్నారు. చెవి రెడ్డి నోటికి జడుస్తున్న ఆధికారులు ఆయనతో గొడవెందుకని అనుకున్న అధికారులు ఎన్ని టికెట్లు అడిగితే అన్ని ఇస్తున్నారు. చెవి రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ వివాధాలు ఉంటాయి. అటు పెద్దాయన అనుచరులను ఇటు గురువు కరుణాకర రెడ్డికీ చెక్ చెబుతూ జిల్లాలో పెత్తనం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు చెవి రెడ్డి. మరి గురువుకు పంగనామాలు పెట్టి పెద్దాయన శిబిరానికి పావులు కదిలిస్తున్న చెవి రెడ్డి అనుకున్నది సాధిస్తారో లేక వివాదాల సుడిగుండంలోనే గుండ్రంగా తిరుగుతారో వేచి చూడాలి.