చెప్పుడు మాటలు విని విఫలమయ్యా: బాబు

 

తాను 1999 వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వాడినని, ఆ తరువాత 2009 వరకూ పలువురు చెప్పిన మాటలు వినటంతో పాటు మొహమాటాలకు పోయి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటంతో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. బాలకృష్ణ పోటీ చేస్తానంటే ఆయన కోరిన సీటును ఇస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని తెలిపారు. సీమాంధ్రలో తనను లేకుండా చేయటంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి సహకరించాలనే ఉద్దేశంతోనే.. టీడీపీ సీమాంధ్రలో బీసీ సీఎం నినాదం ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

 

టీఆర్‌ఎస్‌తో అనుబంధం ఉన్న ఉద్యోగులకే తనపట్ల వ్యతిరేకత ఉందని బాబు వ్యాఖ్యానించారు. అభ్యర్థులను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) పద్ధతి ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎంపిక చేస్తామని అన్నా రు. తొలుత పార్టీ కార్యకర్తలు, ఆ తరువాత ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ సీటుకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకు పంపి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, వీరు ఎవ్వరూ వద్దనుకుంటే మరొకరి పేరు సూచించాలని కోరతామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామన్నారు.