2014 ఎన్నికల్లో టిడిపి వర్సెస్ వై.ఎస్.ఆర్. పార్టీ?

 

 

chandrababu ysr congress, ysr congress tdp, 2014 elections, 2014 elections tdp ysrcongress

 

 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి వీస్తున్న గాలిని బట్టి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనేక రకాలుగా అభాసుపాలైన అధికార కాంగెస్ పక్షం రాష్ట్రంలో మూడవ స్థానంలోకి జారిపోయి, మొదటి రెండు స్థానాల్లో "తెలుగుదేశం''పార్టీ, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న "వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' పక్షమూ ప్రధాన రాజకీయ పక్షాలుగా అవతరించవచ్చునని ఢిల్లీలోని విశ్వసనీయ రాజకీయ పరిశీలకులనుంచి తెలియవస్తున్న సమాచారం. అయితే ఈ నూతన రాజకీయ సమీకరణను అసంభవం చేసే బాధ్యతను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతం తెలంగాణాకు మాత్రమే పరిమితమై తెలుగుజాతిని విషప్రచారం ద్వారా చీల్చడానికి సొంత ఎజెండాతో టి.ఆర్.ఎస్. పార్టీని నెలకొల్పిన ఆంధ్రప్రాంత వలసవాదీ, వేర్పాటువాదీ అయిన కె.సి.ఆర్.పైన రానున్న ఎన్నికలకోసం ఒక బాధ్యత పెట్టింది. "గతంలో డిసెంబర్ 9''న చిదంబరం - తెలంగాణా ఏర్పాటు విషయమై కేంద్రంలో చింతన ప్రారంభమైంది, చర్చలలో ఉందన్న ఆకుకు అందని పోకకు పొందని ఒక ప్రకటన చేశాడు కాబట్టి దానికి కేంద్రం కట్టుబడి ఉంటే, తాను కాంగ్రెస్ లో చేరతానని కెసిఆర్ మాట ఇచ్చాడని, అందుకు ముదరాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్ఠకు విఘాతం కలగకుండా వ్యూహరచన చేయడం 'నీ వంతని' కెసిఆర్ ను అధిష్ఠాన వర్గ ముఖ్యులు కోరారనీ, అందుకు కెసిఆర్ ఒప్పుదల అయ్యాడనీ ఆ పరిశీలకులు వెల్లడిస్తున్నారు.


ఈ ఏర్పాటువల్ల కెసిఆర్ కు వొనగూడే "ప్రతిఫలమేమిట''ని ప్రశ్నించగా ఆ 'ప్రశ్న'లోనే "నిగూఢమైన సమాధానం'' ఉందని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేసే పక్షంలో "ప్రత్యేక తెలంగాణా" రాష్ట్రానికి"నిన్నే "ముఖ్యమంత్రి"ని చేస్తామని అధిష్ఠాన వర్గ ముఖ్యులు హామీ ఇచ్చినట్టు ఈ పరిశీలకులు తెలిపారు. అయితే తెలంగాణాలో టి.ఆర్.ఎస్. పార్టీ "ఎనిమిది పార్లమెంటు స్థానాల''ను గెలుచుకోడానికి అవకాశం వస్తే ఆ సీట్లు అడ్డం పెట్టుకుని కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా, మరొక పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా "తెలంగాణా పేరిట'' బేరసారాలు ఆడవచ్చుననీ, ఎన్నికలకు ముందస్తుగా కాంగ్రెస్, బిజెపి లాంటి జాతీయ పార్టీలతో సీట్ల సర్దుబాట్లు కుదుర్చుకునేకన్నా, ఎన్నికల అనంతరం మాత్రమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తగినట్టుగా సర్దుబాట్లు చేసుకుంటే టి.ఆర్.ఎస్. కీలకపాత్ర వహించగల్గుతుందని కెసిఆర్ వ్యూహమని పరిశీలకుల భావన. అయితే తెలంగాణాలో టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో మరొక రాజకీయ పక్షం దేనితోనూ పొత్తులు పెట్టుకోకుండా "ఒంటరి''గా మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించిందని కెసిఆర్ ప్రకటించడంతో తెలంగాణలో ఆయని ప్రవర్తనను బట్టి అతణ్ణి, అతని మాటలనూ విశ్వసించడం "ఆత్మహత్యా సదృశ్యమ''న్న ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గ ముఖ్యులకు లేకపోలేదు!

 

ఎప్పుడయితే అమలుకురాని షరతుల మీద ఆధారపడి కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపెస్తానని అధిష్ఠాన ముఖ్యులకు హామీ యిచ్చాడన్న వార్త వెల్లడి కావటంతో తెలంగాణా ఉద్యమంలోనూ, ముఖ్యంగా ఉద్యమ నిర్వహణకని ఏర్పడిన "సంయుక్త కార్యాచరణ సంఘం''లోనూ విభేదాలు, చీలికలూ తలెత్తాయి. ఈ పరిణామానికి ఒక చారిత్రిక పునాది ఉంది - తెలంగాణా పేదలను, సాధారణ గ్రామీణ రైతాంగాన్ని, దళిత, బహుజన వర్గాలనూ [వీళ్ళే జనాభాలో అసంఖ్యాకులు] పీల్చి పిప్పిచేస్తూ రెండు అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ఫ్యూడల్ భూస్వామ్య శక్తులు - వెలమ, రెడ్డిదొరలు. నిన్నటిదాకా "ఏలిననాటి శని''గా నేడు "ఏలేనాటి శని''గా మారిన ఈ 'అగ్రవర్ణ వైరుధ్యం' తెలంగాణలో ఈ వర్గాల నాయకత్వంలో తలెత్తే ఏ ఉద్యమంలోనైనా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంది, ఉంటుంది! ఈ కారణంతోనే 'ఉద్యమం' పేరిట జరిపే ధర్నాలు, రాస్తారోకోలు, వంటా-వార్పూ, తాత్కాలిక వూరేగింపుల నిర్వహణలోనూ, "సడక్'' బంద్ లు ఏకోన్ముఖంగా కాకుండా రెండు వేర్వేరు "కుంపట్లు''గా సాగుతున్నాయి. అటు కెసిఆర్, ఇటు కోదండరామ రెడ్డి నేను ముఖముఖాలు చూసుకునే పరిస్థితిలో లేరని ప్రజలకూ తెలిసిపోయింది! ఉద్యోగ, విద్యార్థి, వృత్తిసంఘాలన్నిటా రెండేసి "కుంపట్లు'' నడుస్తున్నాయి. చివరికి ఢిల్లీ "సంసద్'' ధర్నాలో పాల్గొన్నప్పుడు కూడా కెసిఆర్ వర్గం తరపున 'మనిషి'ఒకరు లేకపోతే జనం వేరేగా భావిస్తారేమోనన్న 'కపటం'తో పాల్గొనడమేగాని మనఃపూర్వకంగా పాల్గొనలేదు. దానికి కారణం - కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలిపేయడానికి కెసిఆర్ అధిష్ఠానంతో పడివచ్చిన లాలూచీ తప్ప మరొకటి కాదు.

 

ఈ భాగోతం యిలా ఉండగా అటు చంద్రబాబు "తెలుగుదేశం'' పార్టీ, ఇటు జగన్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' పార్టీ తెలంగాణా సమస్యపట్ల ప్రధానంగా తటస్థవైఖరిని అవలంభిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాపిత పర్యటనలోనేగాక, ప్రధానంగా తెలంగాణా జిల్లాల్లో సహితం వారు నిర్వహించే సభలకు ప్రజలనుంచి వస్తున్న స్పందనను తక్కువ అంచనా వేయడం ప్రమాదకరమని కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ముఖ్యులు హెచ్చరిస్తున్నట్టు ఢిల్లీ పరిశీలకులు సంకేతాలు యిస్తున్నారు! తెలంగాణలో బొత్తిగా "తాడూ-బొంగరం''లేని [ఒకటి రెండు అసెంబ్లీస్థానాలు తప్ప] పార్టీలుగా నమోదైన కమ్యూనిస్టుపార్టీ, బిజెపిలు సహితం టి.ఆర్.ఎస్. 'ఒంటరిపోరు' వ్యూహాలతో, ఎత్తుగడలతో ఏకీభవించడం లేదు సరికదా జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసే ఎత్తుగడలను నిరసించే మార్కిస్టుపార్టీ 'గొంతు'కూడా ఇప్పుడు 'జీర'బోయిందని భావిస్తున్నారట. కాబట్టి అధికార కాంగ్రెస్ ముఖ్యులు కూడా కేంద్రస్థాయినుంచి తెలంగాణా ప్రాంతీయస్థాయి వరకూ చీలిపోయి ఉన్నారు కాబట్టి, "గిరీశం'' పంతులు "అటునుంచి నరుక్కురమ్మన్న''ట్టుగా కెసిఆర్ ను 'దువ్వడం' కోసం టి.ఆర్.ఎస్. ప్రతిపత్తికి కేంద్రనాయకులు ఎసరుపెట్టి కొంతవరకు జయం పొందడానికి నిదర్శనంగా - కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలపడానికి కెసిఆర్ నిర్ణయించడమేనని ఢిల్లీ పరిశీలకులు భావిస్తున్నారు.

 

దీనికి తగ్గట్టుగానే 'ఒంటరి'గా పోటీ చేయడం ద్వారా అసెంబ్లీలో 100 స్థానాలు, పార్లమెంటులో "పది''స్థానాలు పొందగలమన్న కెసిఆర్ ధీమా వెనక అసలు రహస్యాన్ని కూడా కేంద్రనాయకత్వం ఉపఎన్నికలలో పాత అనుభవం దృష్ట్యా పసికట్టిందట! ఆ బ్రహ్మ 'రహస్యం' - తెలంగాణా ప్రజల్లో అనుమానం రాకుండా తలెత్తుకు తిరగడానికి పన్నిన ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ కు యిచ్చిన హామీ ప్రకారం 2012 ఎన్నికల్లో "ప్రతిఫలాపేక్ష'' (క్విడ్ ప్రోకో) సూత్రం ప్రకారం టి.ఆర్.ఎస్. తరపున బలహీనమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం ద్వారా, తెలంగాణాలో కోల్పోయిన ప్రతిష్ఠను కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఎక్కువ స్థానాల్లో సుకరం చేయడం కెసిఆర్ బాధ్యత అవుతుందని, కాని ఈ ఎత్తుగడద్వారా అటు అధికార కాంగ్రెస్, ఇటు టి.ఆర్.ఎస్. జనంముందు అభాసుపాలు కావటం ఖాయమని ఢిల్లీ పరిశీలకులు భావిస్తున్నారు.

 

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో వత్తిళ్ళమధ్య, దుష్ప్రచారం మధ్య "తెలుగుదేశం'' అధ్యక్షుడు అఖిలపక్ష సమావేశంలో "తెలంగాణా ఏర్పాటుకు మేం అడ్డు నిలబడబో''మని లిఖిత పూర్వకంగా హామీ పడివచ్చినా, తర్వాత తెలంగాణాలోనూ, రాష్ట్రంలో ఇతర చోట్ల జరిగిన సభల్లోనూ "ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం కేంద్రం పరిథిలోనిదేగాని, మా పరిదిలోది కాద''ని చంద్రబాబు, ఇతర "దేశం'' నాయకులూ చెబుతూనే వస్తున్నారు. ఇక జగన్ "వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' ఆ వూసోతో నిమిత్తం లేకుండానే ఇటు తెలంగాణాలోనూ, అటు కోస్తాంధ్రలో జరిగిన కొన్ని ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించి పాలకుల్ని పార్టీలనూ ఆశ్చర్యచికితుల్ని చేసింది! ఈ తరుణంలో 2014లో జరిగే ఎన్నికలలో ప్రజలముందుకు రాష్ట్ర విచ్చిత్తి సమస్యపైన ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన రాజకీయపక్షాలు రెండే రెండనీ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పక్షాలుగా జనం మధ్య నిలబడగల స్థితి అటు "తెలుగుదేశం'' పార్టీకి, ఇటు జగన్ పార్టీకి మాత్రమే ఉందనీ, ఆ ఎన్నికలలో మొదటి రెండు స్థానాలలో "తెలుగుదేశం'', జగన్ పార్టీలు మాత్రమే ఉండగలవనీ, మూడవశక్తిగా మాత్రమే అధికార కాంగ్రెస్ మిగిలిపోవలసి వస్తుందనీ ప్రస్తుత పరిణామాలను ఢిల్లీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 

ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి తెలంగాణా సమస్యపై ఒక్కమాట కూడా ఉచ్చరించక పోవటానికి ప్రధాన కారణాలలో ఒకటి - ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎం.పి.లలో ఎకవాక్యత లేకపోవటం కాగా, రెండవ కారణం దేశ సమైక్యతకు వేర్పాటువాదం వల్ల ప్రమాదమని భావించడమేనని ఆ పరిశీలకులు అంటున్నారు. జనాభాలో అల్పసంఖ్యాకులైన రెండు అగ్రవర్ణ సామాజికవర్గాలు తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావడానికి 'ఉద్యమం' పేరిట చేస్తున్న ప్రయత్నాలను ప్రాంతంలోని అసంఖ్యాకులైన బడుగు, బలహీనవర్గాల ప్రజలు తిప్పికొట్టే ఆలోచనలో ఉండటం మరొక కొత్త కోణమని కూడా ఢిల్లీ పరిశీలకులు భావించడం విశేషం! వీరికి తోడుగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలన్నింటిని కలిపి "మన రాష్ట్రం'' ప్రకటించాలని గిరిజనప్రాంతాల సంయుక్త కార్యాచరణ సమితి కూడా డిమాండ్ చేస్తుండడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణలోకి తీసుకోవడం వల్ల తెలంగాణా వనరులు కుంచించుకు పోతాయి!