19న కోల్‌కతాలో మమతతో బాబు భేటీ

 

పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బీజేపీ వ్యతిరేకి అంతేకాకుండా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు బీజేపీ వ్యతిరేక పార్టీలకు లేఖలు సైతం పంపారు.ఏపీ సీఎం చంద్రబాబును కూడా ర్యాలీ లో పాల్గొనమని మమత లేఖ పంపారు.అయితే ప్రస్తుతం చంద్రబాబు జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నది విదితమే.ఇందులో భాగంగా వివిధ పార్టీల నేతలతో సమావేశమైన చంద్రబాబు మమతతో భేటీ అవ్వనున్నారు.ఇప్పటికే ఢిల్లీలో రాహుల్‌, మాయావతి, శరద్‌పవార్‌ వంటి నాయకులతో సమావేశం అనంతరం.. ఆయన ఇటీవలే బెంగళూరు, చెన్నై వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే ఈ నెల 19న కోల్‌కతా వెళ్లి మమతాబెనర్జీతో సమావేశమవనున్నారు.మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీని అత్యంత కీలకమైనదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఇప్పటికే వామపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. వారికి బద్ధశత్రువైన మమతాబెనర్జీతో ఆయన భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే ఇద్దరు ఒకటే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మమత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.బీజేపీ ఓటమే లక్ష్యం తప్ప మరే వివాదాలు కూటమి ఏర్పాటుకు అడ్డంకులు కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.