ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇది

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, ఏపీలో వైద్యుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.

"వైద్యో నారాయణో హరిః అన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలందిస్తోన్న దేవుళ్ళకి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చేతులెత్తి మొక్కుతూ... హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

"ప్రాణదాతలైన వైద్యుల పట్ల ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తోంది. డాక్టర్లకు ఇప్పటికీ పిపిఈ కిట్లు అందించక పోవడం వైసీపీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం. పిపిఈల కోసం విశాఖ ఇఎన్ టి ఆసుపత్రిలో డాక్టర్లు ధర్నా చేసారంటే ఎంత సిగ్గుచేటు!" అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

"మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, నడిరోడ్డుపై అర్థనగ్నంగా, లాఠీలతో కొట్టించి, పిచ్చివాడని ముద్రవేసింది ప్రభుత్వం. ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలి." అని చంద్రబాబు పేర్కొన్నారు.