జగన్ కి బాబు సవాల్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

 

అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. అసెంబ్లీ సమావేశాలలో మొదటి రోజు నుండి 'హెరిటేజ్ ఫ్రెష్’ సంస్థ పేరుని ప్రస్తావిస్తూ అధికార పార్టీ చంద్రబాబుపై విమర్శలు చేస్తుండగా.. వాటిని చంద్రబాబు తిప్పికొట్టారు. గుడివాడలో ఉల్లి పంపిణీ క్యూలైన్లో ఒక వ్యక్తి మరణించారని చంద్రబాబు చెప్పినప్పుడు.. హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.135కు అమ్ముతున్నారని వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ.. హెరిటేజ్ ఫ్రెష్ కి, హెరిటేజ్ ఫుడ్స్ కి తేడా తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేసారు. హెరిటేజ్‌ ఫ్రెష్‌ తమది కాదని దానిని ప్యూచర్‌ గ్రూప్‌ సంస్థకి అమ్మేశామని స్పష్టం చేసారు. అయినా అధికార పార్టీ నుండి విమర్శలు ఆగకపోవడంతో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు.. జగన్ కి సవాల్ విసిరారు. హెరిటేజ్ ఫ్రెష్ మాదికాదని చెప్పామని.. అయినా హెరిటేజ్ మాదే అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్థ మాదే అని రుజువు చేస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. అలా రుజువు చేయలేకపోతే సీఎం జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన సవాల్‌ను సీఎం జగన్, వైసీపీ నేతలు స్వీకరించాలని లేదా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలకు చంద్రబాబు హితవు పలికారు.